యువతి సజీవదహనం.. 16 మందికి మరణశిక్ష

16 Sentenced To Death In Bangladesh For Nusrat Jahan Rafi Death - Sakshi

ఫెని(బంగ్లాదేశ్‌) : ఓ యువతిని సజీవ దహనం చేసిన కేసులో బంగ్లాదేశ్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 16 మందికి మరణశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. నుస్రత్‌ జహాత్‌ రఫీ అనే విద్యార్థిని ఓ శిక్షణ కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడి ప్రధాన అధ్యాపాకుడు ఆమెను లైంగిక వేధించాడు. దీనిపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ టీచర్‌.. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా రఫీపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నుస్రత్‌ వినకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 6వ తేదీన మరికొంత మందితో కలిసి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె శరీరం 80 శాతానికి పైగా కాలిపోయింది. విషమ పరిస్థితుల్లో ఉన్న నుస్రత్‌ను హాస్పిటల్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 10వ తేదీన కన్నుమూశారు. 

నుస్రత్‌ మృతిపై దేశ రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నుస్రత్‌ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై స్పందించిన బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా.. బాధ్యులను తప్పకుండా శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ మహమ్మద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ.. ‘నుస్రత్‌ కేసుకు సంబంధించి ప్రాథమికంగా 18 మందిని అరెస్ట్‌ చేశాం. నుస్రత్‌ కేసు ఉప సంహరించకోకుంటే ఆమెను అంతమొందించాల్సిందిగా టీచర్‌ వారిని ఆదేశించినట్టు నిందితులు విచారణలో అంగీకరించారు. తొలుత వారు నుస్రత్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఆమె బిల్డింగ్‌ పై నుంచి కాలిపోతూ కిందికి రావడంతో అసుల విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో నుస్రత్‌ క్లాస్‌మేట్స్‌ కూడా ఉన్నారు. వారు ఆమెపై కిరోసిన్‌ పోసే ముందు స్కార్ఫ్‌తో ఆమె చేతులను కట్టివేశారు’ అని తెలిపారు. కాగా, ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం 62 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి 16 మందికి మరణశిక్ష విధించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top