
'షీ' బయటపెట్టిన మరో దారుణం
పెళ్లిచేసుకుంటానని నమ్మించి, ఐదురోజులపాటు యువతిని నిర్బంధించిన ఘటనలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనూహ్యపరిణామాల మధ్య షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- పెళ్లి పేరుతో యువతి నిర్బంధం.. లైంగికదాడి
- టోలీచౌకీలోని ఫ్లాట్ పై దాడిచేసి యువతిని కాపాడిన షీ టీమ్స్
హైదరాబాద్: పెళ్లిచేసుకుంటానని నమ్మించి, ఐదురోజులపాటు యువతిని నిర్బంధించిన ఘటనలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనూహ్యపరిణామాల మధ్య షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అహ్మద్ హుస్సేన్.. నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దినెలల కిందట ఉత్తరప్రదేశ్ కు చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే పెళ్లిచేసుకుందామని నమ్మించి ఆమెను హైదరాబాద్ రప్పించాడు. టోలీచౌకీలోని ఓ ఫ్లాట్ లో యువతిని బంధించి హింసించాడు.
ఏం చేయాలో పాలుపోని బాధిత యువతి.. తన దుస్థితినిని మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి, బెంగళూరులోని తన సోదరుడికి పంపింది. సదరు వీడియో ఆధారంగా తన సోదరిని వెతికిపెట్టాలంటూ సోమవారం షీ టీమ్స్ చీఫ్ స్వాతి లక్రాను అభ్యర్థించాడు ఆ యువకుడు. వీడియో, ఫోన్ సిగ్నల్స్ సంబంధిత ప్రదేశాన్ని గుర్తించిన షీ టీమ్ సిబ్బంది.. యువతిని బంధించి ఉంచిన అపార్ట్ మెంట్ పై దాడిచేసి అహ్మద్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. హుస్సేన్ తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. ప్రస్తుతం నిందితుణ్ని హుమాయన్ నగర్ పోలీసులు విచారిస్తున్నారు.