మహా గండం! | water problems faced on hyderbad city | Sakshi
Sakshi News home page

మహా గండం!

May 23 2016 12:03 AM | Updated on Sep 4 2017 12:41 AM

మహా గండం!

మహా గండం!

మహానగర దాహార్తిని తీరుస్తున్న గోదావరి పైపులైన్లకు అడుగుకో గండం పొంచి ఉంది.

సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీరుస్తున్న గోదావరి పైపులైన్లకు అడుగుకో గండం పొంచి ఉంది. ఈ జలాలు తమకూ పంచాలని సమీప గ్రామాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. గ్రేటర్‌కు తాగునీరు అందించేందుకు కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి నగర శివారు ఘన్‌పూర్ వరకు 186 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశారు. ఈ మార్గంలో నిత్యం 86 మిలియన్ల గోదావరి జలాలను సిటీకి తరలిస్తున్నారు. ఈ పైపులైన్‌కు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తమకు తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పైపులైన్ల వాల్వ్‌లు తొలగించి మరీ నీటిని మళ్లించుకుంటున్నారు. తాజాగా (శుక్రవారం) కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసల గ్రామంలో ఆ జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారు. పైపులైన్‌కు ఉన్న బటర్‌ఫ్లై వాల్వ్ కవర్‌ను తొలగించి నీటిని సమీప చెరువు, కుంటలకు మళ్లించుకున్నారు.

దీన్ని పసిగట్టిన జలమండలి సిబ్బంది తొలగించిన వాల్వ్ కవర్‌ను బిగించడంతో ప్రమాదం తప్పింది. కాగా, ప్రస్తుతం మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు వట్టిపోవడంతో ఇపుడు కృష్ణా గోదావరి జలాలే నగర గొంతు తడుపుతున్నాయి. కృష్ణా మూడు దశల ద్వారా 270 మిలియన్ గ్యాలన్లు, గోదావరి ద్వారా 86 ఎంజీడీలు వెరసి రోజుకు 356 ఎంజీడీల నీటిని జలమండలి నగరంలోని 8.75 లక్షల నల్లాలకు అందిస్తోంది.

 
మహానేత చొరవతో..

నగర నీటి అవసరాల కోసం కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారు ఘన్‌పూర్ వరకు గోదావరి మంచినీటి పథకం మొదటిదశ (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సుజలస్రవంతి) పథకాన్ని రూ.3800 కోట్లతో పూర్తి చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో 2008లో మొదలైన ఈపనులు 2015 నాటికి సాకారమయ్యాయి. ఈ జలాల రాకతో నగరంలోని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాలకు తాగునీటి కష్టాలు తీరాయి. తాజాగా ఈ పైపులైన్లకు అడుగుకో గండం నెలకొనడంతో నగర  తాగునీటి అవసరాలకు తరలిస్తున్న నీటికి గండి పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

 
ఆ రెండు జిల్లాల నుంచే వత్తిడి

సిటీకి తరలిస్తున్న గోదావరి జలాలు కరీంనగర్, మెదక్ జిల్లాల మీదుగా వస్తున్నాయి. అయితే, తమ ప్రాంతం నుంచి వెళుతున్నందున ఆ నీటితో తమ దాహార్తిని కూడా తీర్చాలని పైపులైన్లకు ఆనుకొని ఉన్న పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి జలాలను శుద్ధి చేస్తున్న కొండపాక మంచినీటి శుద్ధి కేంద్రం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు తాగునీటిని తరలిస్తుండడంతో మిగతా నియోజకవర్గాలకు కూడా తాగునీటిని తరలించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఆయా ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో పశువులకు సైతం తాగునీరు దొరకడం లేదు. దీంతో పైప్‌లైన్ వాల్వ్‌లను తొలగించక తప్పడంలేదని స్థానికులు చెబుతున్నారు.

 
బాధ్యులపై క్రిమినల్ కేసు

గోదావరి పైపులైన్లకున్న వాల్వ్‌లు, వాటి కవర్లు తొలగించి నీటిని మళ్లిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని జలమండలి వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో జరిగిన సంఘటనలతో పాటు తాజా ఘటనకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపాయి. భారీ పైపులైన్లకు ఉన్న వాల్వ్ కవర్లను తరచూ తొలగిస్తుండడంతో పైపులైన్ల ద్వారా తరలిస్తున్న తాగునీరు పలు చోట్ల లీకవుతోం దని.. లీకేజీని అరికట్టాలంటే ఒకరోజు నగరానికి గోదావరి నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుత తరుణంలో నగరంలో తాగునీటి డిమాండ్ అధికంగా ఉన్నందున సరఫరా నిలిపివేసే పరిస్థితి లేదు. ఇక వర్షాకాలంలోనే ఈ లీకేజీలకు మరమ్మతులు చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement