ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి!

ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి! - Sakshi

- వారి స్థానంలో ప్రత్యామ్నాయాలపై టీఆర్‌ఎస్‌లో విస్త్తృతంగా చర్చ

ప్రజాదరణ ఉన్న నేతల కోసం ఆరాలు

విపక్షాల్లోని బలమైన నేతలపైనా దృష్టి

- జిల్లాల వారీగా జాబితాలపై కసరత్తు

 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత అసంతృప్తిగా ఉన్నారా.. పదే పదే చెబుతున్నా కొందరు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోవడం, స్థానిక అధికార యంత్రాంగంపై పట్టు సాధించలేకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారా.. అలాంటి వారి స్థానంలో ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయాలన్న అంతర్మథనం జరుగుతోందా..? ఈ ప్రశ్నలకు టీఆర్‌ఎస్‌ విశ్వసనీయ వర్గాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించారు. ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు, పార్టీ ఆదరణ అంశాలను బేరీజు వేస్తున్నారు.

 

క్షేత్రస్థాయిలో విశ్లేషణ..

కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ బలోపేతాన్ని పట్టించుకోకుండా సొంత పనులు, వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో కొన్ని మార్పులు అనివార్యమయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కొందరు ఒక్కసారి ఎమ్మెల్యేలను వదిలించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో గెలుపు గుర్రాల ఎంపికపై ప్రాథమికంగా విశ్లేషణ జరుగుతోందని సమాచారం. ఇందులోభాగంగా ఆయా చోట్ల ప్రతిపక్షాల్లో బలమైన నాయకులుగా పేరున్న వారిపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.



అంతేగాకుండా గతంలో టీఆర్‌ఎస్‌లోనే సమర్థులుగా పేరుతెచ్చుకుని వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయిన వారినీ తిరిగి తీసుకొచ్చే యోచన కూడా ఉన్నట్లు సమాచారం. పలు రకాలుగా విఫల ప్రయోగాలు చేసిన టీఆర్‌ఎస్‌ మాజీలు కొందరు రాజీబాటకు వచ్చి రాయబారాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. అటు విపక్షాల తరఫున పోటీచేసి ఓడిపోయిన వారైనా సరే.. బలమైన నేతలుగా పేరున్న వారిని గులాబీ గూటికి ఆహ్వానించాలన్న యోచనలో నాయకత్వం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా జాబితాల తయారీకి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

 

మరిన్ని చేరికలపై దృష్టి

పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో కనీసం రెండు మూడు నియోజకవర్గాల్లో మార్పు ఉండవచ్చని అంటున్నారు. దక్షిణ తెలంగాణలో ఓ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఇక ఇదే జిల్లాలో ఒకరి తొలిసారి అవకాశమివ్వగా అంచనాల మేరకు పనిచేయలేకపోయారని, అనవసర విషయాలతో వివాదాస్పదమయ్యారని చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యే స్థానంలో పొరుగునే ఉన్న మరో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఖాళీ అయిన చోట కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరిని తీసుకొచ్చే పనిలో ఉన్నారని వినికిడి. ఇక ఓ మహిళా ఎమ్మెల్యే స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేను తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.



మరోవైపు మెదక్‌ జిల్లాలో సైతం ఓ మాజీ మంత్రి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ ఆ నేత పెడుతున్న డిమాండ్లతో ప్రతిష్టంభన నెలకొందని అంటున్నారు. ఇక్కడ పార్టీ కేడర్‌కు ఏమాత్రం అందుబాటులో లేని, అధికారులను అజమాయిషీ చేయలేకపోతున్న ఓ ఎమ్మెల్యే స్థానంలో ప్రత్యామ్నాయం కోసం వెదుకుతున్నారని సమాచారం. ఇక్కడ టీఆర్‌ఎస్‌ మాజీ నేత ఒకరు తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారని.. చర్చలు జరిగినా ఇంకా ఒక ముఖ్యనేత గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని తెలిసింది. అటు హైదరాబాద్‌ పొరుగు జిల్లాలో ఒక మాజీ మంత్రిని తీసుకురావాలని సంప్రదింపులు జరిగాయని.. కానీ స్థానిక నేతలు అడ్డుపడి, ప్రస్తుత ఎమ్మెల్యేనే కొనసాగించాలని కోరడంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లు సమాచారం. మొత్తంగా విపక్షాల్లోని కొందరు బలమైన నాయకులను, పార్టీ మాజీలను పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియ తెరవెనుక జోరుగానే సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top