టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ తనయుడు అరెస్టు | TRS Corporator Son Arrested for Molestating Girls on Social Media | Sakshi
Sakshi News home page

నగర యువతులకు నరకం చూపించాడు...

Sep 20 2017 11:08 AM | Updated on Oct 22 2018 6:05 PM

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ తనయుడు అరెస్టు - Sakshi

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ తనయుడు అరెస్టు

మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ తనయుడు అభిషేక్‌ గౌడ్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌ : నగర యువతులకు నరకం చూపాడు!
-15 రోజులుగా యువతులకు  వేధింపులు
నిందితుడు మల్కాజ్‌గిరి కార్పొరేటర్‌ కుమారుడు

సాక్షి, సిటీబ్యూరో : ఫేస్‌బుక్‌లో యువతి పేరుతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి, యువతులకు ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌లు పంపించి, వారి వివరాలు సేకరించి వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని నగర షీ–టీమ్స్‌ బృందం మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. దాదాపు 15 రోజులుగా ఇతను పలువురు యువతులకు నరకం చూపినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడు మల్కాజ్‌గిరి కార్పొరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ కుమారుడు అభిషేక్‌ గౌడ్‌గా గుర్తించారు. మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన అభిషేక్‌ తాను చదివిన స్కూల్‌లో కొన్నేళ్ల క్రితం చదివిన విద్యార్థినుల వివరాలను ఫేస్‌బుక్‌ ద్వారా సేకరించాడు. తానూ అదే స్కూల్‌లో చదివిన యువతిగా పరిచయం చేసుకుంటూ ఖాతా తెరిచాడు.

అప్పటికే స్కూల్‌ పూర్వ విద్యార్థుల వివరాలు అతడికి తెలిసి ఉండటంతో వారందరికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపాడు. అనంతరం వారి ఫోన్‌ నెంబర్లు ఇతర వివరాలు సేకరించిన అభిషేక్‌ ఆ తర్వాత అసలు కథ ప్రారంభించాడు. నేరుగా మల్కాజ్‌గిరి నుంచే కాల్స్‌ చేసి వేధింపులకు పాల్పడితే పోలీసులకు చిక్కే ప్రమాదం ఉందని గుర్తించిన అతను ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ను వినియోగించాడు. గత పక్షం రోజులుగా ఒక్కో యువతికి కాల్‌ చేస్తూ చెప్పలేని విధంగా వేధించేవాడు.

‘నాతో నీవు అశ్లీల చాటింగ్స్‌ చేయాలి. నేను కాల్‌ చేసినప్పుడు ఫోన్‌ పెట్టావంటే మార్ఫింగ్‌ చేసిన నీ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించేవాడు. ఇతడి బాధితుల సంఖ్య పదుల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకోవాలని ప్రయత్నించారు. అయితే దాని చిరునామా ఒకచోట, లోకేషన్స్‌ మరోచోట రావడంతో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.

హైదరాబాద్‌ పోలీసులు ఇటీవల ఎలాంటి కాల్స్‌నైనా గుర్తించే టెక్నాలజీని సమకూర్చుకున్నారు. దీని ఆధారంగా విశ్లేషించి ఇంటర్‌నెట్‌ కాల్స్‌గా తేల్చారు. వీటిపై కూపీ లాగుతూ నిందితుడి కోసం నగరమంతా జల్లెడ పట్టారు. రెండు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి యువతులను వేధిస్తున్నట్లు గుర్తించారు. చివరకు మల్కాజిగిరిలో మంగళవారం రాత్రి అతడిని పట్టుకున్నారు.

అభిషేక్‌ ఉండేది మల్కాజిగిరి ప్రాంతంలోనైనా అక్కడ నుంచి కాల్స్‌ చేస్తే పట్టుబడుతాననే ఉద్దేశంతో గోల్కొండ, బంజారాహిల్స్, చార్మినార్, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో సంచరిస్తూ యువతులను వేధింపులకు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ ఏసీపీ మాట్లాడుతూ... అభిషేక్‌ ఆగడాలపై ముగ్గురు యువతులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అతడు సోషల్‌మీడియాలో యువతుల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేసినట్లు వెల్లడించారు. అభిషేక్‌పై ఐపీసీ సెక్షన్ 67(ఏ), ఐటీ యాక్ట్‌ 354 (డీ) కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు సైబర్‌  క్రైమ్‌  ఏసీపీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement