రైతులకు బేడీలు వేసినా ప్రశ్నించొద్దా?

రైతులకు బేడీలు వేసినా ప్రశ్నించొద్దా? - Sakshi


► ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు– మూడేళ్ల పాలన’పై చర్చాగోష్టి

► ప్రభుత్వాన్ని నిలదీసిన వక్తలు




సాక్షి, హైదరాబాద్‌: రైతులకు బేడీలు వేసినా ఎవరూ ప్రశ్నించకూడదా అని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు–మూడేళ్ల పాలన’ అంశంపై వాయిస్‌ ఫౌండేషన్‌ శనివారం చర్చాగోష్టిని నిర్వహించింది. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ గోష్టిలో టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌ రావు, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, టీడీపీనేతలు ఎ.ఉమా మాధవరెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి,  విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్, దరువు ఎల్లయ్య తదితరులు ప్రసంగించారు.



అప్రజాస్వామికంగా పాలన: రామచందర్‌రావు

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుసున్నది. అప్పులతో ప్రజలపై శాశ్వతంగా పెనుభారాన్ని మోపుతున్నారు. సీఎం కేసీఆర్‌ పాలనావైఫల్యాల గురించి మాట్లాడితే కేంద్రంపై నెడుతున్నారు.



ప్రజల గొంతు నొక్కొద్దు: దినేష్‌రెడ్డి

ఉద్యమాలతో సాధించిన తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడెందుకు అదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించడంలేదు? ఇందిరాపార్కువద్ద ధర్నాలు ప్రజల హక్కు. దానిని హైదరాబాద్‌ బయటకు పం పించాలనే నిర్ణయం ప్రజల గొంతును నొక్కడమే.



కేసీఆర్‌ కుటుంబంకోసమేనా: దిలీప్‌కుమార్‌

రాష్ట్రం కేవలం కేసీఆర్‌ కుటుంబంకోసమే అన్నట్టుగా ఉంది. ప్రజాస్వామిక పరిపాలన, మంత్రులకు అధికారం, ప్రజా సమస్యల పరిష్కారం వంటివేమీ లేవు. ధనిక రాష్ట్రంలో అభివృద్ధి ఏమీలేకపోగా మూడేళ్లు కాకముందే అప్పులు రెట్టింపు చేశారు. రాష్ట్రాన్ని పోలీసురాజ్యంగా మార్చారు.



ప్రజల గొంత నొక్కలేరు: ఉమామాధవరెడ్డి

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించడం లేదు. ఒక్క ఎర్రవల్లిలో కడితే రాష్ట్రమంతా పూర్తిచేసినట్టా? ధర్నాచౌక్‌ను తీసేసి ప్రజల గొంతును నొక్కాల నుకుంటే సాధ్యంకాదు.



రాచరిక పాలన వస్తదనుకోలేదు: అద్దంకి దయాకర్‌

తెలంగాణ వస్తే ప్రశ్నించే సత్తాను కోల్పోతామను కోలేదు. ఇలాంటి రాచరిక పాలన వస్తుందనుకో లేదు. సీఎం కేసీఆర్‌ పక్కన దొంగలను పెట్టుకుని రైతులకు బేడీలు వేస్తారా?



ఆందోళనతోనే పరిష్కారం: రామయ్య

ప్రజల ఆందోళనలు లేకుండా సమస్యలు పరి ష్కారం అవుతాయని నేను అనుకోవడంలేదు. నేను ఏ రాజకీయపార్టీకి చెందినవాడిని కాదు. ధర్నాచౌక్‌ విషయంలో ప్రభుత్వమే ప్రజాస్వామికంగా వ్యవ హరించాలి.



ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలేదు: కోదండరాం

వలసాంధ్రంపాలన పోయి తెలంగాణ పాలన వస్తే అభివృద్ధి జరుగుతుందని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో కుల మత వర్గ రహితంగా జరిగిన ఐక్య పోరాటాల స్ఫూర్తిగా నీళ్లు, నియామకాలు వస్తాయనుకున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ డిమాండ్లను గుర్తించడం లేదు. అధికారంలో ఉన్నవాళ్లు ఏం చేసినా ఇతరులు ప్రశ్నించొద్దు అనే అప్రజాస్వామిక ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇంకా పదిసార్లు మా ఇంటి తలుపులు బద్దలు కొట్టినా ప్రజాస్వామిక నిర్మాణంలో ముందుంటా.



రేవంత్‌ను చూస్తే కేసీఆర్‌ ప్యాంటు తడిసిపోతోంది: కె.నారాయణ

తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనికిమాలినవాడైన కె.చంద్రశేఖర్‌రావు కావడం ప్రజల దురదృష్టం. టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ మంత్రి వర్గంలో చేర్చుకున్న దివాళాకోరు. ముక్కు మూరెడు ఉన్నా, మనిషి బారెడున్నా సీఎం కేసీఆర్‌కు లోపల భయం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని చూస్తే సీఎం కేసీఆర్‌కు ఎందుకో ప్యాంటు తడుస్తున్నది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top