ఎమ్మెల్యే తల్లి అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ? | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే తల్లి అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?

Published Fri, Nov 6 2015 2:25 AM

ఎమ్మెల్యే తల్లి అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ? - Sakshi

టీఎస్‌ఐఐసీ కమిషనర్ వివరణ కోరిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద తల్లి కె. శ్యామల అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు గురువారం స్పందించింది. ఈ విషయంలో ఫిర్యాదు అందినా చర్యలు చేపట్టకపోవడంపై తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) కమిషనర్ వివరణ కోరింది. తమ ముందు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు.
 
 కుత్బుల్లాపూర్ మండలం షాపూర్‌నగర్‌లోని సర్వే నంబర్లు 279 పార్ట్, 280 పార్ట్‌లలో స్థానిక శాసన సభ్యుడు కె.పి.వివేకానంద తల్లి కె.శ్యామల రోడ్డును ఆక్రమించుకోవడంపాటు నిబంధనలకు విరుద్ధంగా భవన సదుదాయాన్ని నిర్మించారని...వాటిని కూల్చేసేలా టీఎస్‌ఐఐసీని ఆదేశించాలంటూ పిటిషనర్ కె.ఎం.ప్రతాప్ వేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ కుమారుడు ఎమ్మెల్యే కావడంతో శ్యామల ప్రజలు ఉపయోగించే రోడ్డునే ఆక్రమించి, నిబంధనలను విరుద్ధంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మించారన్నారు.
 
 దీనిపై తన క్లయింట్ టీఎస్‌ఐఐసీ అధికారులకు ఫిర్యాదు చేసి (పారిశ్రామిక ప్రాంతం కావడంతో) సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరినా టీఎస్‌ఐఐసీ కమిషనర్ ఇవ్వలేదన్నారు. అలాగే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని...నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ వినతిపత్రాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని టీఎస్‌ఐఐసీ కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Advertisement
Advertisement