వారు వాడుతుంటే మీరేం చేస్తున్నారు? | Sakshi
Sakshi News home page

వారు వాడుతుంటే మీరేం చేస్తున్నారు?

Published Wed, Mar 15 2017 4:07 AM

వారు వాడుతుంటే మీరేం చేస్తున్నారు?

పేరు, లోగో వ్యవహారంలో ఎస్‌బీఐని ప్రశ్నించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పేరు, లోగోను ప్రైవేటు కంపెనీలైన ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లు వాడుకుంటుండటంపై దాఖలైన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎస్‌బీఐ చైర్‌పర్సన్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్‌ యాజమాన్యాలను ఆదేశిస్తూ... నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏజేఐ) జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు... ఎస్‌బీఐకి సంబంధం లేదని, అయినప్పటికీ ఆ కంపెనీలు ఎస్‌బీఐ పేరు, లోగో వాడుతున్నా ఎస్‌బీఐ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన వి.బి.కృష్ణమూర్తి హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి...
ఈ సందర్భంగా కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ... ప్రైవేటు కంపెనీలైన ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు ప్రభుత్వ రంగ సంస్థయిన ఎస్‌బీఐ లోగోను వాడుకునే అధికారం లేదన్నారు. ఈ విషయాన్ని ఎస్‌బీఐని అడిగితే... వారు తమ లోగోను వాడుకోవడానికి ఎవరికీ అనుమతినివ్వలేదని తెలిపారన్నారు. అశోక చక్రం, అశోక స్తూపం తదితరాలను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు వినియోగించకుండా చట్టంలో నిషేధం ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... ఎస్‌బీఐ లోగో కూడా ఆ చట్ట నిషేధిత జాబితాలో ఉందా.. లేదా.. పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటామంటూ ఆ మేర నోటీసులిచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement