న్యూఢిల్లీ: ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ‘ఎస్‌బీఐజీ హెల్త్ ఆల్ఫా’ పేరుతో హెల్త్ ఇన్సూరెన్స్ పరిష్కార్నాన్ని ఆవిష్కరించింది. కస్టమర్ల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా హెల్త్‌ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించింది. ఎన్నో రకాల ఆప్షనల్ (ఐచ్ఛిక) ప్రయోజనాలతో తీసుకోవచ్చని తెలిపింది.
మెరుగైన క్యుములేటివ్ బోనస్, సమ్ ఇన్సూర్డ్ (బీమా రక్షణ) ఆప్షన్లలో సౌలభ్యం, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలతో అనుసంధానం, నేటి జీవనశైలి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన కవరేజీని హెల్త్ ఆల్ఫా అందిస్తుందని వెల్లడించింది. ఇందులో 50కు పైగా కవరేజీ ఆప్షన్లు ఉన్నట్టు, జిమ్, క్రీడా గాయాలు, ఫిట్‌నెస్ సంబంధిత గాయాలకు ఓపీడీ కవరేజీ ప్రయోజనం ఉన్నట్టు తెలిపింది.
జీవితాంతం ఒకే తరహా ప్రయోజనాలతో కాకుండా, వివిధ స్థాయిల్లోని అవసరాలకు అనుగుణంగా (వివాహానంతరం ప్రసవ సంబంధిత, పిల్లల ఆరోగ్య సంబంధిత, వృద్ధాప్యంలో అదనపు కవరేజీ తదితర) ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ పేర్కొంది. అదనపు యాడాన్‌లను తీసుకుని, అవసరం లేని వాటిని ఆప్ట్ అవుట్ చేసుకునేందుకు సైతం అవకాశం ఉంటుందని తెలిపింది.


