సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఉన్న అడ్వకేట్స్ క్యాంటీన్లో గురువారం రాత్రి దొంగలుపడ్డారు.
మారేడుపల్లి : సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఉన్న అడ్వకేట్స్ క్యాంటీన్లో గురువారం రాత్రి దొంగలుపడ్డారు. పెద్ద వంటగిన్నెల నుంచి స్పూన్ల దాకా ఉన్నవన్నీ ఊడ్చుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన రమేష్ కోర్టు ప్రాంగణంలో అడ్వకేట్స్ బార్ అసోషియేషన్ క్యాంటీన్‌ను నడుపుతున్నాడు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి 8.30 గంటలకు క్యాంటీన్‌కు తాళాలు వేసి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయ వచ్చి చూసేసరికి క్యాంటిన్‌లో వంట సామగ్రి కనిపించలేదు.
భారీ వంటగిన్నెలతోపాటు చెంచాలను కూడా దుండగులు వదల్లేదు. అంతేకాదు నిల్వ ఉన్న 75 కేజీల బియ్యం, 50 కేజీల పప్పుదినుసులను కూడా మాయం చేసేశారు. వెనుక నుంచి తాళాలను పగుల గొట్టి దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించారు పోలీసులు. భారీ వంట సామగ్రిని తరలించటానికి ట్రాలీ వంటి వాహనంతో దుండగులు పక్కా ప్రణాళికతో వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.85 వేలుంటుందని బాధితుడు తెలిపారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు.