నేడూ భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు మరింత బలపడి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
⇒ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వానలు
⇒ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు
⇒ పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
⇒ పలుచోట్ల కూలిన ఇళ్లు.. పంట నష్టం
⇒ నల్లగొండ, దేవరకొండల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
⇒ ఎండిపోతున్న పంటలకు జీవం వస్తుందన్న వ్యవసాయ నిపుణులు
⇒ రబీకి మేలు చేస్తుందని వెల్లడి
సాక్షి నెట్‌వర్క్, హైదరాబాద్
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో నైరుతి రుతుపవనాలు మరింత బలపడి.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు నల్లగొండ, దేవరకొండల్లో తొమ్మిది సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. మిర్యాలగూడ, మాచారెడ్డి, కంపాసాగర్‌లలో 6, రామాయంపేట, మెదక్, జగిత్యాల, ఆదిలాబాద్, గాంధారిలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.
ఏటా జూన్ 1 నుంచి సెప్టెంబర్ 13 మధ్య రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 665.2 మిల్లీమీటర్లు కాగా.. ఈసారి అదే సమయంలో 640.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. నల్లగొండ జిల్లాలో 23 శాతం అధిక వర్షపాతం నమోదవగా.. మెదక్ జిల్లాలో 24 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 15 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇక వచ్చే నెల నుంచి రబీ సీజన్ మొదలుకానుండటంతో.. తాజా వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లోకి నీరు చేరే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి రబీ పంటలకు మేలు చేస్తుందంటున్నారు.
పొంగిన వాగులు.. కూలిన ఇళ్లు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకూ వర్షాలు కురిశాయి. ప్రధానంగా నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు చెరువులు నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. వాన ధాటికి పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. నల్లగొండ జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. హాలియూ మండలం డొక్కలబావితండాలో చెక్‌డ్యాం తెగి 30 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మిర్యాలగూడ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కలెక్టరేట్‌లోకి వర్షపు నీరు చేరింది. ఈ జిల్లాలోని ఆత్మకూరు, పెబ్బేరు, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మక్తల్, కల్వకుర్తి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో రైతులు మరోసారి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ వానలు పత్తికి ఊతమివ్వగా, ఆగస్టులో వేసిన మొక్కజొన్న, జొన్న పంటలకు కలిసొస్తుందని వ్యవసాయాధికారులు తెలిపారు. ఇక రంగారెడ్డి జిల్లాలోని తిప్పాయిగూడలో వాన ధాటికి ఓ పెంకుటిల్లు నేలకూలింది. మేడ్చల్ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనం కూలడంతో దంపతులు గాయపడ్డారు. పెద్దేముల్ మండలంలో కంది పంట వర్షానికి నీట మునిగింది. ఇక మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు ఐదు ఇళ్లు కూలిపోయాయి. రామాయంపేట మండలం నందిగామలో ఎండబెట్టిన మొక్కజొన్న తడిచిపోయింది.
హైదరాబాద్ జలమయం
మంగళవారం కురిసిన వానధాటికి హైదరాబాద్ నగరం జలమయమైంది. హయత్‌నగర్, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, మలక్‌పేట్, అబిడ్స్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పలు దఫాలుగా కుండపోత కురియడంతో రహదారులపై మోకాళ్ల లోతున నీరు చేరింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు మాదాపూర్, కుత్బుల్లాపూర్, శ్రీనగర్ కాలనీ, సరూర్‌నగర్, షేక్‌పేటల్లో 3 సెంటీ మీటర్లు, బండ్లగూడ, గోల్కొండ, ఫీవర్ ఆస్పత్రి ప్రాంతాల్లో 2 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది.


