పర్యావరణాన్ని పరిరక్షించాలి

Protect the environment - Sakshi

అసెంబ్లీ కమిటీ సమావేశంలో స్పీకర్‌ మధుసూదనాచారి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అద్భుతమైన అటవీ ప్రాంతాలు, సహజ ఆవాసాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిని పరిరక్షించుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రాన్ని పర్యాటకంగానే కాకుండా దేశంలోనే గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇందుకోసం అటవీ, పర్యాటక శాఖలకు తోడు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్‌ అధ్యక్షతన జరిగింది. అటవీ సంపద, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఎకో టూరిజం అభివృద్ధిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని, దానిని అసెంబ్లీ కమిటీ తరఫున ప్రభుత్వానికి పంపుదామని స్పీకర్‌ సూచించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, కిషన్‌రెడ్డి, దివాకర్‌రావు, బాపూరావు రాథోడ్, గువ్వల బాలరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

పర్యావరణహిత టూరిజం అభివృద్ధికి ప్రణాళిక
వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖ తరఫున చేపట్టిన కార్యక్రమాలు, పథకాలపై సమావేశంలో పీసీసీఎఫ్‌ పీకే ఝా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వేట నియంత్రణకు పోలీసులు, అటవీ సిబ్బం దితో ఉమ్మడి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, పర్యావరణహిత టూరిజం అభివృద్ధికి త్వరలోనే ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అటవీశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో అర్బన్‌ పార్కులను  అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆహ్వానం మేరకు హరితహారం, అటవీ పునరుజ్జీవన చర్యలు, అర్బన్‌ పార్కుల సందర్శనకు కమిటీ త్వరలోనే వెళ్తుందని స్పీకర్‌ మధుసూదనాచారి ప్రకటించారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top