పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష రేపే | police conistable last test tomarrow | Sakshi
Sakshi News home page

పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష రేపే

Oct 22 2016 2:46 AM | Updated on Sep 17 2018 6:26 PM

పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష రేపే - Sakshi

పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష రేపే

పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలో కీలకమైన తుది పరీక్ష ఆదివారం జరగనుంది.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు

 సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలో కీలకమైన తుది పరీక్ష ఆదివారం జరగనుంది. 9,281 పోస్టుల కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 153 (అన్ని పాత జిల్లాల్లో) కేంద్రాల్లో 81,523 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. హైదరాబాద్‌లో 13 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. పరీక్షకు వచ్చే అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలని పోలీస్ నియామక సంస్థ సూచించింది.

విధి విధానాలు, గుర్తుంచుకోవాల్సిన కీలకాంశాలు..
హాల్‌టికెట్‌ను పరీక్ష కేంద్రం ప్రవేశంలో, పరీక్ష హాలులో చూపించాల్సి ఉంటుంది.
పరీక్ష ప్రారంభానికి గంట ముందు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు హాలులోనే ఉండాలి. ఎవరినీ బయటకు అనుమతించరు.
పరీక్షకు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి.
ఒరిజి నల్ హాల్ టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులైతే ఐడీ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్‌ల్లో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకురావాలి. జిరాక్స్ ప్రతులు, స్కాన్డ్ కాపీలు అనుమతించరు.
డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకున్న హాల్‌టికెట్లపై అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త తీసుకోవాలి. అలా లేని హాల్‌టికెట్లతో వచ్చిన వారిని అనుమతించరు.      
ఫోన్లు, కాలిక్యులేటర్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని హాలులోకి అనుమతించరు.
ప్రిలిమినరీ పరీక్షలు, దేహ దారుఢ్య పరీక్షల సందర్భంగా సేకరించిన అభ్యర్థుల వేలిముద్రలను బయోమెట్రిక్ పద్ధతిలో సరిచూస్తారు.
ఓఎంఆర్ షీట్‌లో మార్కింగ్స్ మొదలుపెట్టే ముందు ప్రశ్నపత్రం బుక్‌లెట్ కోడ్‌ను సరిచూసుకోవాలి.
ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ భాషలో ఉంటాయి.
ఓఎంఆర్ షీట్లపై ఎలాంటి అసందర్భ రాతలు ఉన్నా తిరస్కరిస్తారు. మాల్ ప్రాక్టీస్ సహా ఎలాంటి చర్యలకు పాల్పడినా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లతో పాటు ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ను కూడా తిరిగి ఇవ్వాల్సిఉంటుంది. అలా చేయని వారి జవాబు పత్రాలను తిరస్కరించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
ఓఎంఆర్ షీటుతో పాటు జోడించి ఉన్న డూప్లికేట్ ప్రతిని పరీక్ష ముగిసిన తర్వాత మాత్రమే ఇన్విజిలేటర్ సమక్షంలో వేరు చేసి అభ్యర్థులు తీసుకెళ్లాలి.
పరీక్ష కేంద్రం మార్గం, చిరునామాలు గుర్తించేందుకు పరీక్షకు ఒక రోజు ముందే అభ్యర్థులు వెళ్లి రావాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement