వాడుకలో లేని పీఎఫ్‌లకూ వడ్డీ | PF interest will be appilcable to unuseable PF accounts | Sakshi
Sakshi News home page

వాడుకలో లేని పీఎఫ్‌లకూ వడ్డీ

Apr 3 2016 2:18 AM | Updated on Sep 2 2018 3:34 PM

దేశ వ్యాప్తంగా వాడుకలో లేని భవిష్యనిధి ఖాతాల నిధులకు వడ్డీ చెల్లింపులు ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు.

- కార్మికులు మూడు రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు: దత్తాత్రేయ
- కనీస వేతన సవరణ బిల్లుకు విపక్షాలే అడ్డు

 
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వాడుకలో లేని భవిష్యనిధి ఖాతాల నిధులకు వడ్డీ చెల్లింపులు ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. 9.23 కోట్ల మంది కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాడుకలో లేని ఖాతాలంటూ యూపీఏ ప్రభుత్వం 2011 నుంచి వడ్డీ చెల్లింపులు నిలిపేసిందని, కానీ వాటన్నింటికీ వడ్డీని తిరిగి వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వివరించారు. అలాగే కార్మికులు తమ పీఎఫ్ క్లెయిమ్స్ విషయంలో ఎవరి మీద ఆధారపడకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.
 
 యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబర్)ను ఆధార్‌తో బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయడం ద్వారా కేవలం మూడు రోజుల్లోనే పీఎఫ్ నిధులు సెటిల్‌మెంట్ చేసుకోవచ్చన్నారు. యూఏఎన్ అనుసంధానం జరగని ఖాతాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా ఇకపై పది మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలనూ ఈపీఎఫ్ చట్ట పరిధిలోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. అయితే దీనిపై పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగకుండా వామపక్షాలు, కాంగ్రెస్ అడ్డుపడుతున్నాయన్నారు.
 
 హెచ్‌సీఎల్ కంపెనీని ఆదుకోండి: కోదండరామ్
 హిందుస్థాన్ కేబుల్ కంపెనీ(హెచ్‌సీఎల్)ని మూతపడకుండా ఆదుకోవాలని దత్తాత్రేయను జేఏసీ చైర్మన్ కోదండరామ్ కోరారు. ఇటీవల హెచ్‌సీఎల్‌ను ఖాయిలాపడిన పరిశ్రమల జాబితాతో కేంద్ర పరిశ్రమల శాఖ చేర్చిందన్నారు. దీంతో ఈ కంపెనీలో పనిచేస్తున్న 600 మంది రోడ్డున పడే ప్రమాదం తలెత్తిందన్నారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. దీనికి మంత్రి దత్తాత్రేయ స్పందిస్తూ.. డిజిటల్ ఇండియాలో భాగంగా అన్ని గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అవసరమని, ఈ నేపథ్యంలో పరిశ్రమలశాఖ, రక్షణశాఖ మంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీడీ కట్టలపై పుర్రెగుర్తు సైజును తగ్గించాలని బీజేపీ రాష్ట్రశాఖ, బీఎంఎస్(భారతీయ మజ్దూరు యూనియన్)లు వేరు వేరుగా వినతి పత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement