ఏం చేద్దాం? | Osmania patients or debate on the move | Sakshi
Sakshi News home page

ఏం చేద్దాం?

Jul 28 2015 12:51 AM | Updated on Sep 3 2017 6:16 AM

ఏం చేద్దాం?

ఏం చేద్దాం?

ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోని రోగుల తరలింపు అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

ఉస్మానియా రోగుల తరలింపుపై తర్జన భర్జన
ఏరియా ఆస్పత్రులపై పునరాలోచన
 ప్రసూతి సేవలన్నీ ఒకే చోట అందించాలని ప్రతిపాదన

 
సిటీబ్యూరో:  ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోని రోగుల తరలింపు అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జనరల్ మెడిసిన్ వి భాగాన్ని ఫీవర్ ఆస్పత్రికి, ఆర్థోపెడిక్ విభాగాన్ని కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ... మిగతా విభాగాల తరలింపు అంశాన్ని ఎటూ తేల్చలేకపోవడంతో వాటి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సర్జికల్ గ్యాస్ట్రో, న్యూరాలజీ వ ంటి కీలక విభాగాలను మెడికల్ కళాశాలకు దూరంగా ఏరియా ఆస్పత్రులకు తరలిస్తే శస్త్ర చికిత్సలకు ఇబ్బందులు తప్పవు. అంతే కాదు... మెడికో లీగల్ (ఎంఎల్‌సీ) కేసుల విషయం వైద్యుల మధ్య ఘర్షణ సృష్టించే అవకాశం ఉంది. ఎంసీఐ మెడికల్ సీట్లను రద్దు చేసే ప్రమాదం ఉంది. ఆయా ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లు శస్త్రచికిత్సలకు పనికిరావనే అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో దీనిపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. రోగులందరినీ రెండు మూడు చోట్ల సర్దుబాటు చేస్తే ఎలాంటి సమస్యలూ ఉండవు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి మంగళవారం మరోసారి వైద్యులు, అధికారులతో చర్చించి, ఆ తర్వాత తుదినిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.

 పేట్లబురుజుకు సుల్తాన్‌బజార్
 ఉస్మానియా రోగులను పేట్లబురుజుకు తరలిస్తే... గర్భిణులు, బాలింతలు, ఇతర మహిళలు ఉండే చోట పురుషులను ఉంచాల్సి వస్తుంది. దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలోని రోగులను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి తరలించడం వల్ల సాంకేతికంగా సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా మెడికల్ కాలేజీకి సమీపంలో 360 పడకలను సర్దుబాటు చేయవచ్చు. దీని వల్ల రోగులకే కాదు... వైద్యులు, వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఇక నిలోఫర్ నవజాత శిశువుల కేంద్రంలో తగినన్ని పడకలు లేకపోవడంతో ఒకే పడకపై ముగ్గురు నలుగురు రోగులను ఉంచి చికిత్స చేస్తున్నారు. 400 పడకల సామర్థ్యం ఉన్న కొత్త భవనాన్ని ఇచ్చేందుకు ఎన్‌ఆర్‌హెచ్‌ఎం అంగీకరించకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇందుకు అంగీకరిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. ఒక వేళ నిరాకరిస్తే ఏం చేయాలనేది ప్రశ్నార్థకంగా మారింది.

 నర్సింగ్ విద్యార్థుల తరలింపుపై విస్త్రృత చర్చ
 ఓ వైపు పాత భవనంలోని పడకల తరలింపు అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతుండగా... మరోవైపు నర్సింగ్ కాలేజీ విద్యా ర్థులు, నర్సులు తమ భవితవ్యంపై విస్త్రృతంగా చర్చించుకుంటున్నారు. ‘రోగులను తరలిస్తారు సరే.. మా సంగతేమిటి?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఆస్పత్రిలో ఏపీ నర్సింగ్ అసోసియేషన్‌లోని నర్సులంతా సమావేశమయ్యారు. తమకు ఎక్కడ ఆశ్రయం కల్పిస్తారో స్పష్టం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పడకల తరలింపు, సర్దుబాటు అంశంపై తమ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని... ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. నర్సులంతా విధులను బహిష్కరించి సమావేశం కావడంతో సకాలంలో వైద్యసేవలు అందక రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement