ఇప్పుడు మాకున్నది ఇద్దరు ఎమ్మెల్యేలేనా...! | only two mla's in bjp ? | Sakshi
Sakshi News home page

ఇప్పుడు మాకున్నది ఇద్దరు ఎమ్మెల్యేలేనా...!

Jan 10 2016 11:23 AM | Updated on Aug 10 2018 8:16 PM

ఇప్పుడు మాకున్నది ఇద్దరు ఎమ్మెల్యేలేనా...! - Sakshi

ఇప్పుడు మాకున్నది ఇద్దరు ఎమ్మెల్యేలేనా...!

గత ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ పొత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే బీజేపీ అయిదు సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ పొత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే బీజేపీ అయిదు సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్న అయిదుగురు ఎమ్మెల్యేల్లో పార్టీకి అసలు ఎంత మంది పనికొస్తారనే చర్చ కమలనాథుల్లో సాగుతోందట. ఉండడానికి సంఖ్య అయిదయినా, వాస్తవానికి పనికొచ్చేది, జీహేచ్‌ఎంసీ ఎన్నికల్లో కాస్తాకూస్తో బలాన్ని ప్రదర్శించగలిగేది ఇద్దరు మాత్రమేనని బీజేపీ నాయకులు నిట్టూర్పులు విడుస్తున్నారట.
 
 అదేంటీ అయిదుగురు ఎమ్మెల్యేలుండి ఇద్దరే పనికొస్తారంటే ఎలా అని దీనిపై కొందరు అంతర్గతచర్చల్లో ఆరా తీశారట. ఒక ఎమ్మెల్యే బీఫ్ వ్యవహారంలో పార్టీ నాయకత్వంపైనే బహిరంగంగా ఆరోపణలు చేసి ఏకంగా శివసేన పార్టీకి దగ్గరవుతున్నట్లు, ఇంకొక ఎమ్మెల్యే సాధు రాజకీయాల్లో తలమునకలై పోయారని, మరో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని పారిశ్రామికప్రాంతంలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారని పార్టీ నాయకులే గుసగుసలు పోతున్నారట.
 
  గ్రేటర్ ఎన్నికల్లో వీరి సహకారం, అభ్యర్థులను గెలిపించుకోవడంలో పార్టీకి, టీడీ పీ-బీజేపీ కూటమికి ఏ మేరకు ఉపయోగపడతారన్నది అనుమానమేనని అంటున్నారు. అదీగాకుండా ఏవో కారణాలతో ఒకరిద్దరు అధికారపార్టీకి కొంత అనుకూలంగా కూడా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని చెవులు కొరుక్కుంటున్నారట. బీజేపీ నాయకుల పరిస్థితి ఈ విధంగా ఉండగా ఆ పార్టీతో పొత్తులో భాగంగా కలసి పోటీచేయాలనుకుంటున్న టీడీపీ నాయకులు కూడా కొందరు బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారట.
 
  ఈ ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థులు, ముఖ్యంగా మేయర్ అభ్యర్థి పోటీచేయడానికి జంకుతున్నట్లు స్వయంగా టీడీపీ నాయకులే వెల్లడిస్తున్నారట. చివరకు ఎటుపోయి ఎటు వస్తుందో, బీజేపీతో పొత్తుతో ఏమి జరుగుతుందోనన్న టెన్షన్‌లో ‘దేశం’ నాయకులు కిందా మీదా పడుతున్నారట...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement