నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ | No entry if Minute delayed | Sakshi
Sakshi News home page

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Jul 9 2016 12:19 AM | Updated on Oct 9 2018 7:11 PM

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం (ఈనెల 9న) జరగనున్న ఎంసెట్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు.

నేడు ఉదయం 10 గంటలకు ఎంసెట్-2 పరీక్ష

 సాక్షి, హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం (ఈనెల 9న) జరగనున్న ఎంసెట్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని.. విద్యార్థులను 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. వర్షాకాలం అయినందున వీలైనంత ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్లోకి వచ్చాక పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు వెళ్లనీయరని పేర్కొన్నారు.

బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పరీక్ష రాయాలని... ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంపై కలర్ ఫొటో అంటించి పరీక్ష కేంద్రంలో అందజేయాలని సూచించారు. పరీక్ష హాల్లోకి మొబైల్స్, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరని స్పష్టం చేశారు. ఈసారి విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రం కింద ఉండే కార్బన్‌లెస్ జవాబుల కాపీని ఇస్తామని చెప్పారు. ఈ పరీక్ష ప్రాథమిక కీని శనివారమే విడుదల చేస్తామన్నారు. దానిపై 12వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, 14న ర్యాంకులు విడుదల చేస్తామని వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 95 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 56,188 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అందులో తెలంగాణ నుంచి 38,245 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది పరీక్ష రాయనున్నారు. ఏపీకి చెందిన విద్యార్థుల కోసం కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 ఉదయం 6 గంటలకు ప్రశ్నపత్రం సెట్ కోడ్ విడుదల
 ఎంసెట్-2 ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను శనివారం ఉదయం 6 గంటలకు విడుదల చేయనున్నారు. జేఎన్టీయూహెచ్‌లో వైద్య ఆర్యోగ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ కోడ్‌ను విడుదల చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement