వైద్యుడి మృతిపై వీడని మిస్టరీ | mystery in doctor raghavendra rao death | Sakshi
Sakshi News home page

వైద్యుడి మృతిపై వీడని మిస్టరీ

Aug 28 2015 12:52 PM | Updated on Sep 3 2017 8:18 AM

వైద్యుడి మృతిపై వీడని మిస్టరీ

వైద్యుడి మృతిపై వీడని మిస్టరీ

కిమ్స్ ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ రాఘవేందర్‌రావు మృతి మిస్టరీగా మారింది.

కుత్బుల్లాపూర్: కిమ్స్ ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ రాఘవేందర్‌రావు మృతి మిస్టరీగా మారింది. జీడిమెట్ల కాంటన్‌పార్కు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ప్లాట్ నెం. 6 లో ఉండే రాఘవేందర్‌రావు(60)కు భార్య స్వర్ణలత, కుమార్తె సుదీప, కుమారుడు శ్రీధర్ సంతానం. పిల్లలు అమెరికాలో స్థిరపడగా భార్యాభర్తలు మాత్రం కాంటన్ పార్కులోని తమ విల్లాలో ఉంటున్నారు. కిమ్స్ ఆస్పత్రిలో ఈఎన్‌టీ విభాగంలో పనిచేస్తున్న రాఘవేందర్‌రావు రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి ఆస్పత్రికి బయలు దేరారు. మధ్యాహ్నం 1.30కి భార్య స్వర్ణలత ఫోన్ చేయగా నేను బిజీగా ఉన్నా.. తర్వాత ఫోన్ చేస్తానంటూ ఫోన్ కట్ చేశాడు. అనంతరం 3 గంటలకు మరోసారి స్వర్ణతల ఫోన్ చేయగా రాఘవేందర్‌రావు నుంచి ఎలాంటి స్పందనలేదు. ఆమె గంటల తరబడి ఫోన్ చేస్తూనే ఉంది. ఫోన్ రింగ్ అవుతున్నా ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె  బంధువులకు, అమెరికాలో ఉన్న కుమార్తె, కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు. ఇలా రాత్రి వరకు ఆందోళనకు గురైన స్వర్ణలత చివరకు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

కొట్టొచ్చిన పోలీసుల నిర్లక్ష్యం..

మంగళవారం రాత్రి 10 గంటలకు స్వర్ణలత స్థానికంగా ఉన్న పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు బంధువులతో కలిసి వెళ్లారు.  తన భర్త కనిపించడంలేదని ఆమె చెప్పగా.. రేపు  (బుధవారం) ఉదయం 11 గంటలకు వచ్చి ఫిర్యాదు చేయని ఉచితం సలహా ఇవ్వడం పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఓ ప్రముఖ వైద్యుడి అదృశ్యంపై ఉన్నతాధికారులకు వివరించి తక్షణమే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ కనుగొని ఉంటే  రాత్రే రాఘవేందర్‌రావు ఆచూకీ తెలిసి ఉండేదని అందరూ అంటున్నారు.  ఇదిలా ఉండగా..  అమెరికాలో ఉన్న కుమారుడు శ్రీధర్ తండ్రి రాఘవేందర్‌రావు ఆచూకీ కోసం టెక్నాలజీని ఉపయోగించారు.  గుగూల్ మ్యాప్ ద్వారా  తండ్రి వద్ద ఉన్న బీఎండబ్ల్యూ కారు సిస్టమ్‌తో పాటు బ్లాక్ బెర్రీ ఫోన్ సిగ్నల్స్ బీపీఎస్ సెర్చ్ ద్వారా బోయిన్‌పల్లి హర్షవర్ధన్‌కాలనీలో తండ్రి రాఘవేందర్‌రావు కారు ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే.

కిమ్స్‌లో మృతదేహం ...

అమెరికాలో ఉంటున్న కుమారుడు శ్రీధర్, కుమార్తె సుదీప గురువారం రాత్రి నగరానికి చేరుకోనున్నారు. శుక్రవారం అల్వాల్‌లో రాఘవేంద్రరావు అంత్యక్రియలకు ఏర్పాటు చేశామని బంధువులు తెలిపారు. కాగా, గాంధీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కిమ్స్ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు.

ఆగమేఘాలపై ఎఫ్‌ఐఆర్ ..?

మంగళవారం రాత్రి రాఘవేంద్రరావు భార్య స్వర్ణలత ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే రేపు రమ్మని చెప్పిన బషీరాబాద్ పోలీసులు.. బుధవారం ఉదయం 7 గంటలకు మృతదేహం కనిపించిందని తెలియగానే మంగళవారం రాత్రి 12 గంటలకే జీడీ ఎంటర్ చేసి  ఆగమేఘాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్న విమర్శలున్నాయి.  

రసూల్‌పురా: డాక్టర్ రాఘవేందర్‌రావు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో భద్రపరిచారు. కాగా, మృతుడు మద్యం తాగి ఉన్నట్టు బోయిన్‌పల్లి పోలీసులు పేర్కొన్నారు. రాఘవేందర్‌రావు గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నామని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారని పోలీసులు తెలిపారు. విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఫోన్ కాల్‌డేటా, ఇతర ఆధారాలు ఫోరెన్సిక్ విభాగానికి పంపారు. నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement