ప్రకృతి విపత్తు.. ప్రళయ సహాయం

సాగర్‌లో  సైనికుల సన్నాహకం


వరద సహాయక చర్యలపై అవగాహన కల్పించనున్న ఆర్మీ  

‘ప్రళయ సహాయం’ పేరుతో కార్యక్రమం  

సాగర్‌ వేదికగా ఈనెల 22, 23 తేదీల్లో మాక్‌డ్రిల్‌  

పాల్గొంటున్న 500 మంది సైనికులు  




ప్రకృతి విపత్తులు వస్తే పరిస్థితేంటి? వరద ఉప్పొంగితే, నగరం జలమయమైతే ఏం చేయాలి? బాధితులను ఎలా రక్షించాలి? నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ సంయుక్తాధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌ వేదికగా ఈనెల 22, 23 తేదీల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 500 మంది సైనికులు పాల్గొంటున్నారు.       – సాక్షి, సిటీబ్యూరో  



ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ సహకారం అందిస్తోంది. ఈ మాక్‌డ్రిల్‌లో భాగంగా పీపుల్స్‌ ప్లాజాలో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. వరద బాధితులను ఎలా రక్షించాలనే అంశంపై ఇక్కడ ప్రదర్శన ఉంటుంది. ఇప్పటికే సైనికులు సాగర తీరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సాగర్‌ చుట్టూ సైనికులు పహారా కాస్తున్నారు. సాగర్‌లో మూడు విభాగాలుగా గృహసముదాయాలు ఏర్పాటు చేశారు. నీటిలో ప్రమాద శాతం తక్కువగా ఉండే ప్రాంతాన్ని ఒకటో సముదాయంగా ఒడ్డుకు కొద్ది దూరంలో నిర్మించారు. ప్రమాదం మధ్యస్తంగా రెండో విభాగాన్ని ఒడ్డుకు ఇంకొద్ది దూరంలో నిర్మించారు. ఇక ప్రమాద తీవ్రత ఎక్కువున్న ప్రాంతంగా మూడో విభాగాన్ని సాగర్‌ మధ్యలో ఏర్పాటు చేశారు. ఈ మూడు ప్రాంతాల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహించనున్నారు.



 నిఘా నీడలో..  

ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందుకు అత్యాధునికి కెమెరాలు వినియోగిస్తున్నారు. విద్యుత్‌ సహాయంతో ఎడారి ప్రాంతాల్లో, మంచుకొండల్లో సైన్యం వినియోగించే ప్రత్యేక వైర్‌లెస్‌ పరికరాలను కెమెరా రికార్డింగ్‌ల కోసం ఇక్కడ అందుబాటులో ఉంచారు. ట్యాంక్‌బండ్‌ చుట్టూ దాదాపు 12 ప్రత్యేక కెమెరాలతో ఈ మాక్‌డ్రిల్‌ను డిజిటల్‌ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.   



ప్రవేశం ఉచితం..

ఈ ప్రదర్శనను తిలకించేందుకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. ఈనెల 22, 23 తేదీల్లో సంజీవయ్య పార్క్, హుస్సేన్‌సాగర్‌ వేదికగా సైనికుల విన్యాస ప్రదర్శనలు ఉంటాయి.



అవగాహన వేదిక..  

ప్రకృతి విపత్తులపై అవగాహన కల్పించేందుకు ఆర్మీ ప్రతి ఏటా ఏదో ఒక మహానగరంలో మాక్‌డ్రిల్‌ చేపడుతుంది. హైదరాబాద్‌లోని చాలా కాలనీలు తరచూ ముంపునకు గురవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగరంలో ఈ మాక్‌డ్రిల్‌ నిర్వహించనున్నారు. సిటీ జలమయమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?  వరద బాధితులను ఎలా రక్షించాలి? ఏ శాఖ ఏ పని చేయాలి? తదితర విషయాలపై ఇందులో అవగాహన కల్పిస్తారు. ఆర్మీ ఆఫీసర్లు, అంతర్జాతీయ వక్తలు ఇందులో పాల్గొంటారు.– బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top