మార్చి 13న తెలంగాణ బంద్‌

manda krishna on SC Classification Bill - Sakshi

ఎస్సీ వర్గీకరణ కోసం..: మంద కృష్ణ  

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ మార్చి 13న తెలంగాణ బంద్‌ చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ ప్రకటించారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల పాటు బంద్‌ నిర్వహిస్తామని.. ఇందుకు టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు తీసుకుంటామని వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంద కృష్ణ మీడియాతో మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ మద్దతు విషయమై సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం లేఖ ఇచ్చానని, కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారని నమ్మకముందని చెప్పారు. బంద్‌కు టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చినపుడు ఎమ్మార్పీఎస్‌ మొదట మద్దతు తెలిపిన విషయం గుర్తు చేశారు. కేసీఆర్‌ను కలిస్తే అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లే అంశాన్నీ వివరిస్తానన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని, ఈ మేరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని వివరించారు.

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మంద కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, కానీ నాలుగేళ్లు కావస్తున్నా బిల్లు ఊసెత్తకపోవడం శోచనీయమన్నారు. రాజ్యాంగం ప్రకారంఅన్ని వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు దక్కాలని, కానీ దళిత వర్గాల్లోని కొన్ని కులాలే వాటి ఫలాలు ఎక్కువగా పొందాయని చెప్పారు. వర్గీకరణతో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.   

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top