కాళేశ్వరం పనుల ప్రత్యక్ష ప్రసారం

Live stream of Kaleshwaram works - Sakshi

జలసౌధలో ప్రత్యేక స్క్రీన్ల ఏర్పాటు

ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులతో హరీశ్‌రావు ముఖాముఖి

హైదరాబాద్‌ నుంచే పనుల పర్యవేక్షణ, కంట్రోల్‌ సిబ్బంది పనితీరుపై ఆరా

సకాలంలో పంపుల సరఫరాకు బీహెచ్‌ఈఎల్‌ హామీ

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి మంత్రి హరీశ్‌రావు టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. ఈ ప్రాజెక్టుకు చెందిన మూడు బ్యారేజీలు, మూడు పంప్‌హౌజ్‌లు, గ్రావిటీ కెనాల్, గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులను స్వయంగా మూడు రోజులపాటు పరిశీలించిన మంత్రి, అనంతరం జలసౌధ నుంచి ఆయా పనుల పురోగతిని ప్రత్యక్ష ప్రసారం(లైవ్‌) ద్వారా తనిఖీ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. శనివారం జలసౌధలో ఏర్పాటు చేసిన లైవ్‌ స్క్రీన్‌ నుంచి మంత్రి హరీశ్‌ కాళేశ్వరం ప్రగతిని పర్యవేక్షించారు. మంత్రి లైవ్‌లోకి రావడంతో అన్నారం బ్యారేజీలో పనిచేస్తున్న అధికార యంత్రాంగం, సిబ్బంది నివ్వెరపోయారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న సంబంధిత ఏజెన్సీ ఇంజనీర్, ఇరిగేషన్‌ ఇంజనీర్లతో నేరుగా సంభాషించారు.

పనులు జరుగుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. శనివారంనాడు ఎంత కాంక్రీటు వేశారు? ఎంత టార్గెట్‌ రీచ్‌ అయ్యారు? ఎన్ని గేట్లు ఫ్యాబ్రికేట్‌ చేశారు అని ఇరిగేషన్‌ ఈఈ మల్లికార్జున ప్రసాద్‌ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు సైటులో ఉండే ప్లేస్మెంట్‌ రిజిష్టర్‌ను తనిఖీ చేశారు. క్వాలిటీ కంట్రోల్‌ సిబ్బంది, ఫీల్డ్‌ ఇంజనీర్ల విధుల రికార్డులను కూడా మంత్రి హైదరాబాద్‌ నుంచే తనిఖీ చేశారు. గత నెల డిసెంబర్‌లో 1.04 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయని సైటు ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. జనవరి నుంచి ప్రతినెలా 1.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనుల లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సైట్‌ ఇంజనీర్లు మంత్రికి వివరించారు. కాగా కాళేశ్వరంకు సంబంధించిన ప్యాకేజీ –6, ప్యాకేజీ– 8లకు అవసరమైన పంపులు, మోటార్లు, ఇతర యంత్ర పరికరాలను సకాలంలో సరఫరా చేస్తామని బీహెచ్‌ఈఎల్‌ ఉన్నతాధికారుల బృందం ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. శనివారం ఈ బృందం హరీశ్‌రావుతో జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. 

ఛనాకా–కొరటా పనులపై ఆగ్రహం.. 
ఛనాకా–కొరటా ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగడంపట్ల హరీశ్‌రావు అధికారులు, ఏజెన్సీల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు 1,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు జరగని పక్షంలో ఏజెన్సీని మార్చుతామని ఆయన హెచ్చరించారు. 15 రోజులలో పనుల పురోగతి లేకపోతే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి నెలాఖరులోపు బ్యారేజీ పియర్స్‌ను బ్రిడ్జి లెవల్‌ వరకు లేపాలని, ఈలోగా గేట్ల తయారీ పూర్తి చేయాలన్నారు. వెనువెంటనే గేట్లను బిగించాలని కోరారు. జనవరి 15 లోపు సర్జ్‌పూల్‌ డిజైను, డెలివరీ సిస్టమ్, ప్రెషర్‌ పైపులైను వ్యాలీ క్రాసింగ్‌ డిజైన్లను పూర్తి చేయాలని సీడీఓ సీఈని ఆదేశించారు. మిగిలిన పైపులైన్‌ నిర్మాణాన్ని మార్చి చివరిలోగా పూర్తి చేయాలని హరీశ్‌ కోరారు. పవర్‌ లైన్స్‌ ఏర్పాటుకు 11 ప్రాంతాల్లో భూయజమానులతో ఇబ్బందులు ఉన్నట్టు ట్రాన్స్‌కో డైరెక్టర్‌ సూర్యప్రకాశరావు మంత్రికి తెలిపారు. దీనిపై ఆదిలాబాద్‌ జిల్లా మంత్రి జోగు రామన్నతో హరీశ్‌ ఫోన్లో మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top