ప్రపంచంలో మేలైన పారిశ్రామిక విధానం | KTR shares selfie with Tim Cook,KCR | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో మేలైన పారిశ్రామిక విధానం

May 20 2016 4:49 AM | Updated on Aug 20 2018 2:55 PM

ప్రపంచంలో మేలైన పారిశ్రామిక విధానం - Sakshi

ప్రపంచంలో మేలైన పారిశ్రామిక విధానం

ప్రపంచంలో మేలైన వస్తూత్పత్తి సంస్థగా యాపిల్ కంపెనీ పేరొందినట్లే... పారిశ్రామిక విధానానికి తెలంగాణ రాష్ట్రం ప్రఖ్యాతి గాంచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు.

* పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధి చెందండి
* యాపిల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో మేలైన వస్తూత్పత్తి సంస్థగా యాపిల్ కంపెనీ పేరొందినట్లే... పారిశ్రామిక విధానానికి తెలంగాణ రాష్ట్రం ప్రఖ్యాతి గాంచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ పురోభివృద్ధిలో పాలుపంచుకునేందుకు యాపిల్ ముందు కొచ్చినందుకు హర్షం వెలిబుచ్చారు. ‘‘హైదరాబాద్ విశ్వనగరంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులతో ముందుకురావటం ఆనందకరం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత స్థాయి పారిశ్రామిక విధానాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

పెట్టుబడిదారులకు ఏ మాత్రం ఇబ్బందులు కలుగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. ‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, కలసికట్టుగా అభివృద్ధి చెందేందుకు దోహదపడండి..’ అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్‌లో యాపిల్ సంస్థ మ్యాప్స్ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో పాటు ఆయన బృందంతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం ప్రసంగించారు. ఆటంకాలేమీ లేకుండా, నిర్ణీత సమయంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన విధానాలను తాము అమలుపరుస్తున్నామన్నారు. ఆ దిశగా ఇప్పటికే తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దేశ విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగిస్తున్నాయని చెప్పారు. ‘‘ప్రపంచ ఐటీ రంగ దిగ్గజాలైన ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను స్థాపించుకున్నాయి.

వాటికి యాపిల్ తోడవడం తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశ, దశ ప్రపంచ దిగ్గజమైన యాపిల్ సీఈవో టిమ్ కుక్ రాకతో రూఢీ అయ్యాయి. ఆయనకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నామని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని సీఎం అన్నారు. యాపిల్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టిమ్‌కుక్ ఆనందంతో సీఎం కేసీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు.

కార్యక్రమంలో ఐటీ మంత్రి కె.తారకరామారావు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించారు. ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, యాపిల్ సంస్థ అధికారులు, డిజిటల్ మీడియా డెరైక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, యాపిల్ సీఈవో టీమ్ కుక్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్నటి దాకా ఐటీ మంత్రి కేటీఆర్ లేవనెత్తిన సస్పెన్స్‌కు టిమ్ కుక్ రాకతో తెరపడిందని ఈ సందర్భంగా సీఎం చమత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement