కరువు మండలాల నివేదికను మా ముందుంచండి | Joint High Court orders for Drought Zone Report | Sakshi
Sakshi News home page

కరువు మండలాల నివేదికను మా ముందుంచండి

Jun 10 2016 1:01 AM | Updated on Sep 4 2017 2:05 AM

కరువు మండలాల నివేదికను మా ముందుంచండి

కరువు మండలాల నివేదికను మా ముందుంచండి

కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనకు సంబంధించి కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని...

* తెలంగాణ సర్కారుకు ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు
* విచారణ రెండు వారాలకు వాయిదా

సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనకు సంబంధించి కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని  ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. అలాగే కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనకు అనుసరించిన విధానం ఏమిటో కూడా స్పష్టం చేయాలంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

కరీంనగర్ జిల్లాలో 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ చేసిన సిఫారసులను పట్టించుకోకుండా 19 మండలాలనే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. దీనిని సవాలు చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ దిలీప్ బి బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ శాశ్వత నీటి సదుపాయాలున్న కారణంతో జిల్లాలో పలు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించలేదన్నారు.

జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని తాము వినతి పత్రం సమర్పించామని, దానిని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందించి, కరువు మండలాల ప్రకటనకు అనుసరిస్తున్న విధానం ఏమిటని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది జీవీ భాస్కర్‌రెడ్డి సమాధానమిస్తూ కరువు మండలాల ప్రకటనకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత కమిటీ కరువు మండలాలను ప్రకటించిందన్నారు. ఇందుకు సంబంధించి కమిటీ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఆ నివేదికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement