
ప్రధానితో మాట్లాడతా..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను రీకాల్ చేసే అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో స్వయంగా మాట్లాడతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
- హెచ్‌సీయూ వీసీ రీకాల్‌పై సభలో సీఎం కేసీఆర్
- రోహిత్ మరణం కలచివేసింది
- వివక్షాపూరిత ఘటనలు క్షమార్హం కాదు.. వీసీ రీకాల్ అంశంపై తీర్మానం అనవసరం
- ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నా
- హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై నిష్పక్షపాత దర్యాప్తు..
- కన్హయ్య పర్యటనను అడ్డుకోవద్దని పోలీసులకు చెప్పా.. వర్సిటీ సిబ్బందే ఆయనను అడ్డుకున్నారు
- ఓయూ ఘటనలో విద్యార్థులు ఆవేశానికి లోనయ్యారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను రీకాల్ చేసే అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో స్వయంగా మాట్లాడతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై వీలైతే రెండు మూడు రోజుల్లోనే స్పష్టత వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం శాంతి, సుహృద్భావాలను కోరుకుంటున్నదనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఇటీవల హెచ్‌సీయూ, ఉస్మానియా యూనివర్సిటీల్లో జరిగిన ఘటనలపై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు.
ఈ రెండు ఘటనల్లో పోలీసులు పరిధిని అతిక్రమించారని భావిస్తే... ఉన్నత స్థాయి అధికారితో నిష్పక్షపాత విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆ విచారణ నివేదికను సభ్యులకు ఇవ్వడంతో పాటు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలకు వెనుకాడబోదని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావును రీకాల్ చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న విపక్ష సభ్యుల డిమాండ్‌ను సీఎం తిరస్కరించారు. ’‘అలా తీర్మానం చేయడం సభ స్థాయికి తగదు. తీర్మానం చేసేంత పెద్దమనిషి కాదు. వీసీ రీకాల్ అంశం మన పరిధిలోకి రాదు. ఈ అంశంపై చర్చ అనవసరం..’’ అని స్పష్టం చేశారు. చర్చ సందర్భంగా కొందరు సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ఉటంకిస్తూ చేసిన వ్యాఖ్యలతో రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఉంటాయని.. వాటిని తొలగించి ముందుకు సాగుదామని సూచించారు.
రోహిత్ ఆత్మహత్య కలచివేసింది
విద్యార్థుల్లో యువరక్తం, భావోద్వేగాల వల్ల కొన్ని ఘటనలు జరుగుతాయని... దళిత, గిరిజన విద్యార్థుల పట్ల వివక్షాపూరిత ఘటనలు జరగడం క్షమార్హం కాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రోహిత్ దళితుడా, కాదా అన్నది పక్కన పెడితే ఒక విద్యార్థి మరణించడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. ‘‘రోహిత్ మరణిస్తే సీఎం వెళ్లలేదనే మాట నిజం. ఆ వార్త మమ్మల్ని కలచివేసింది. ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని పంపడంతో పాటు గతంలో యూనివర్సిటీలో చదువుకున్న తెలంగాణ పూర్వ విద్యార్థుల ద్వారా విషయాలను తెలుసుకున్నాం. రోహిత్ చాలా తెలివైన విద్యార్థి. ఐఏఎస్, ఐపీఎస్ సాధించే సత్తా కలిగినవాడని తెలుసుకుని చాలా బాధపడ్డాం. అలాంటి ఘటనలు దేశానికి, రాష్ట్రానికి మంచి సంకేతాలు కావు..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాహుల్, కేజ్రీవాల్ వంటి రాజకీయ నేతలు సందర్శించిన నేపథ్యంలో హెచ్‌సీయూకు వెళ్లాలా, వద్దా అనే మీమాంస ఎదుర్కొన్నామని, అలాగని తమకు బాధలేదని కాదని చెప్పారు. అలాంటి ఘటన జరగాల్సింది కాదని, ఏ సీఎం కూడా అలాంటి ఘటనలను కోరుకోరన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
కన్హయ్యను అడ్డుకోవద్దని చెప్పా
ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయనను అడ్డుకుని, అరెస్టు చేయొద్దని డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులకు సూచించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రోహిత్ వేముల తల్లిని పరామర్శించేందుకు కన్హయ్య రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్నారు. కొందరు తనను కూడా ఒత్తిళ్లకు గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో తమ భావాన్ని చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నందున కన్హయ్య పర్యటనకు సహకరించామన్నారు. అయితే కన్హయ్య హెచ్‌సీయూలోకి వెళ్లే క్రమంలో వీసీ ఆదేశాల మేరకు ఖాకీ దుస్తుల్లో ఉన్న వర్సిటీ సిబ్బంది అడ్డుకున్నారని చెప్పారు. వీసీ అప్పారావు విధుల్లో చేరడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారని, ఆ సమయంలో పోలీసులు విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. మెస్, వాటర్, విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని, ఎవరైనా అతిగా ప్రవర్తించారని భావిస్తే విచారణ జరుపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
త్వరలో వీసీల నియామకం
సిద్ధాంతాల వైరుధ్యంతో గతంలో విద్యార్థుల మధ్య గొడవలు జరిగినా పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసేవారని... ప్రస్తుతం సిద్ధాంతాల పేరిట నిత్యం ఘర్షణ వాతావరణం సృష్టించడం సరికాదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో పనిచేసిన కొందరు వీసీలు ఇష్టారీతిన ఉద్యోగ నియామకాలు జరిపారని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో గ్రాంట్లు నిలిచిపోయాయని చెప్పారు. వ్యక్తి కేంద్రంగా కాకుండా, సంస్థ కేంద్రంగా పనిచేసే వ్యక్తులను వీసీలుగా నియమిస్తామని... ఇప్పటికే సెర్చ్ కమిటీ వేశామని, త్వరలోనే వీసీలను నియమిస్తామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఘటనలో విద్యార్థులు ఆవేశానికి లోనయ్యారని.. ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌పై జరిగిన దాడిని దురదృష్టకరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని... కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క మెమొరాండం ఇచ్చారని చెప్పారు. ఆ ఘటనపై ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామన్నారు.