సురక్షితం.. సుందరం

సురక్షితం.. సుందరం - Sakshi


* అందరికీ మంచినీరు కోసం 30 టీఎంసీల జలాశయాలు

* త్వరలోనే రెండు మార్గాల్లో మెట్రో రైలుకూత

* ఏడాది చివరికి అందుబాటులోకి ఔటర్ రింగ్ రోడ్డు

* రూ.20వేల కోట్లతో 20 ప్రదేశాల్లో ఫ్లై ఓవర్లు, ఆకాశమార్గాలు

* మూసీనది వెంట 42 కి.మీ.ల ఆరు వరుసల రహదారాలు

* 13 మురికివాడల్లో లక్ష  మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు

* టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో




సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాన్ని పూర్తి సురక్షిత.. సుందర ప్రాంతంగా తీర్చి దిద్దే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి తమ ప్రభుత్వ ప్రాథమ్యాలను వెల్లడించింది.



శనివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో హైదరాబాద్‌ను పూర్తి సురక్షితంగా తీర్చిదిద్ది.. నగర వాసులకు సుందర జీవితాన్ని అందించడమే లక్ష్యమని పేర్కొంది. మంచినీరు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్, ప్రజా రవాణాను మెరుగుపరిచే దిశగా మొత్తం 62 అంశాలతో కార్యాచరణను ప్రకటించింది.

 

అందరికీ మంచినీరు

నగర  వాసులందరికీ సురక్షిత మంచి నీరందించే దిశగా 30 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో శామీర్‌పేట, రాచకొండలలో భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నట్లు మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ పార్టీ పేర్కొంది. జంట జలాశయాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలుతో పాటు కబ్జాలకు గురైన నాలుగు వేల చెరువుల పునరుద్ధరణ, హుస్సేన్ సాగర్ శుద్ధికి మురుగు నీటి కాల్వలను మళ్లిస్తామని టీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. మూసీ ఆధునికీకరణతో పాటు దీని వెంట ఉప్పల్ నుంచి లంగర్‌హౌస్ వరకు 42 కి.మీ.ల మేర ఆరు వరసలతో కూడిన రహదారిని నిర్మిస్తామని పేర్కొంది.

 

రెండు మార్గాల్లో మెట్రో రైలు

ఉప్పల్- మెట్టుగూడ, మియాపూర్ -అమీర్‌పేట మార్గంలో జూన్ నెల తరువాత మెట్రో రైలు రాకపోకలు ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న 72 కి.మీ. మెట్రో రైలు మార్గాలను, 200 కి.మీ.కు విస్తరిస్తామని... ఎంఎంటీఎస్ మార్గాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి యాదగిరి గుట్ట వరకు పొడిగిస్తామని హామీనిచ్చింది. రూ. 20వేల కోట్లతో 20 ప్రదేశాల్లో ఫ్లై ఓవర్లు, ఆకాశమార్గాలు, 11 ప్రధాన కారిడార్లు, 50 గ్రిడ్ సపరేటర్లతో 2000 కి.మీ.ల నూతన రహదారుల నిర్మాణం ప్రారంభిస్తామని ప్రకటించింది. వచ్చే డిసెంబర్ నాటికి ఔటర్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తామని తెలిపింది.

 

లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే దిశగా ఇప్పటికే 22 లక్షల కుటుంబాలకు తడి-పొడి చెత్త సేకరణ డబ్బాలు పంపిణీ చేశామని, వ్యర్థాలకు 200 - 300 ఎకరాల విస్తీర్ణంలో 15 కొత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామని పార్టీ తెలిపింది. 13 మురికివాడల్లోని 17 ప్రదేశాల్లో వచ్చే ఐదేళ్లలో లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. నగరంలోని 36 శ్మశాన వాటికల్లో అధునాతన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించింది. నగరానికి నిరంతర విద్యుత్ సరఫరాకు 420 కేవీ ప్రత్యేక లైన్‌తో పాటు రూ.1920 కోట్లతో నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించింది.

 

అన్ని వర్గాలకూ భద్రత

నగరంలోని అన్ని వర్గాలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా, ఇప్పటికే కొనుగోలు చేసిన ఇన్నోవా వాహనాలతో జీపీఎస్ అనుసంధానం చేస్తామని అధికార పార్టీ పేర్కొంది. 24 అంతస్తులతో నగర పోలీస్ కమిషనరేట్‌ను నిర్మించి, అధునాతన కమాండ్ కంట్రోల్  వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపింది. నగరంలో 92 పట్టణ వైద్యశాలల ఆధునీకరణ, పరికరాల కొనుగోలుతో పాటు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రులకు వేర్వేరుగా బడ్జెట్ కేటాయిస్తున్నామని తెలియజేసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top