‘హైటెక్ కాపీయింగ్’ సూత్రధారి అరెస్టు
సంచలనం రేపిన ఆర్‌ఆర్‌సీ (రైల్వే నియామక విభాగం) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సూత్రధారితో ....
ఆర్‌ఆర్‌సీ ఐదు పరీక్షల్లో కాపీయింగ్
సిటీబ్యూరో: సంచలనం రేపిన ఆర్‌ఆర్‌సీ (రైల్వే నియామక విభాగం) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సూత్రధారితో పాటు మరో ఇద్దరిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఎస్‌ఓటీ అదనపు డీసీపీ ఈ.రామచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... హైటెక్ కాపీయింగ్ వ్యవహారంలో సూత్రధారి అయిన రైల్వే ఉద్యోగి లాలాగూడకు చెందిన మలోతు మశ్ఛంద్రా (39)తో పాటు పరీక్ష సెంటర్‌లో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న రైల్ నిలయం టెలికాం ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగి పెకెటి రాజశేఖర్ (35), ఇతనికి అవసరమైన సెల్‌ఫోన్‌లు, బ్లూటూత్‌లను సరఫరా చేసిన బేగంపేటకు చెందిన ఎలక్ట్రానిక్ షాప్ యజమాని చంద్ర ప్రకాష్ కుమార్ (32)ను కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సెల్‌ఫోన్‌లు, బ్లూటూత్, ల్యాప్‌టాప్,స్పైకెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ మౌలాలిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి గతనెల 30న ఆర్‌ఆర్‌సీ పరీక్ష పత్రం లేకేజీ వ్యవహారాన్ని బయటపెట్టడంతో పాటు 20 మంది ముఠా సభ్యులతో పాటు 10 మంది అభ్యర్థులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
లీకేజీకి రూ.50 వేలు...
గతనెలలో ఆర్‌ఆర్‌సీ నిర్వహించిన గ్రూప్-డీ పరీక్ష గత నెలలో ఐదు దఫాలుగా సాగింది. పరీక్ష కేంద్రాల్లో రాజశేఖర్‌ను ఇన్విజిలేటర్‌గా నియమించారు.హైటెక్ కాపీయింగ్‌లో ముఠా నాయకుడైన మశ్ఛంద్రా, రాజశేఖర్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. పరీక్ష హాల్‌లో ఉన్న ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి, దానిని వాట్సాప్ ద్వారా తమకు అందించాలన్నది వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందం. ఇలా ఒక ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు రూ.50 వేలు రాజశేఖర్ తీసుకునేవాడు. ఇలా ఐదుసార్లు పరీక్షా పత్రం లీక్ చేశాడు. కూకట్‌పల్లిలోని ప్రగతి స్కూల్, మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్, బంజారాహిల్స్‌లోని సెయింట్ ఆల్ఫాన్స్, తిరుమలగిరిలోని గౌతమ్ పబ్లిక్ స్కూల్, కూకట్‌పల్లిలోని సిద్దార్థ స్కూల్ నుంచి ప్రశ్నపత్రం లీక్ చేశాడు. ఈ ముఠా 2008, 2010లో జరిగిన ఆర్‌ఆర్‌బీ పరీక్ష పత్రం లీక్ చేసి, కాపీయింగ్‌కు పాల్పడేందుకు రైల్ నిలయంలోని సీనియర్ కమర్షియల్ మేనేజర్ స్వామినాయక్‌తో ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో బ్లూటూత్‌లు పనిచేయకపోవడంతో వీరి పన్నాగం పారలేదు. 2013లో జరిగిన వీఆర్‌ఓ ఉద్యోగాల పరీక్షల్లో కూడా పై పద్ధతుల్లో కాపియింగ్‌కు సిద్ధపడింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో మెడికల్ పేపర్ లీక్‌కావడంతో భయపడి తమ ప్లాన్‌ను అమలు చేయలేదు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు శేఖర్‌గౌడ్, వి.ఉమేందర్, బి.పుష్పన్‌కుమార్, ఎస్‌ఐలు పి.ఆంజనేయులు, ఎ.రాములు పాల్గొన్నారు.


