బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్‌! | high court shock to chandrababu government | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్‌!

Jan 7 2016 1:12 AM | Updated on Aug 31 2018 8:24 PM

బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్‌! - Sakshi

బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్‌!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణానికి పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కొక్కరు రూ.10 చెల్లించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టింది.

► బలవంతపు వసూళ్లకు వీల్లేదు..
► ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ
 
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణానికి పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కొక్కరు రూ.10 చెల్లించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టింది. అలా ఎలా బలవంతపు వసూళ్లకు పాల్పడతారంటూ ప్రశ్నించింది. బలవంతపు వసూళ్లకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. రూ.10 ఇవ్వాలని ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలా చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపింది.


ప్రతివాదులుగా ఉన్న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ గుంటూరు ప్రాంతీయ జాయింట్ డెరైక్టర్, జిల్లా విద్యాశాఖాధికారికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ‘నా రాజధాని-నా అమరావతి-నా ఇటుక’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి తలా రూ.10 వసూలు చేసి ఆ మొత్తాలు ఈ నెల 10వ తేదీలోపు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన ఎస్.కె.బషీర్ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి విచారించారు. పిటిషనర్ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు.


పిటిషన్‌ను కొద్దిసేపు క్షుణ్ణంగా చదివిన న్యాయమూర్తి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల గురించి పాఠశాల విద్యాశాఖ తరఫు న్యాయవాది మూలా విజయభాస్కర్‌ను వివరణ కోరారు. విద్యార్థులు రూ.10 ఇవ్వాలని ఉత్తర్వులు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. దీంతో విజయభాస్కర్ బిత్తరపోయారు. ఏం చెప్పాలో అర్థం కానట్టుగా కొద్దిసేపు పిటిషన్ బండిల్‌లో ఏవో కాగితాలు చూస్తూ ఉండిపోయారు. తర్వాత తేరుకుని రూ.10 విరాళం బలవంతం కాదని, స్వచ్ఛందమేనని చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన సమాధానంతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇస్తే వాటిని తీసుకుంటే ఎవరికీ అభ్యంతరాలు ఉండవని, ఉత్తర్వులు జారీ చేసి మరీ బలవంతంగా విరాళాలు స్వీకరించడం ఎంత మాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement