జల శోకం | Groundwater depletion | Sakshi
Sakshi News home page

జల శోకం

Feb 4 2015 12:40 AM | Updated on Sep 2 2017 8:44 PM

జల శోకం

జల శోకం

వేసవి రాకముందే మహా నగరంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

అడుగంటుతున్న భూగర్భ జలాలు
 జనవరి చివరి నాటికే  భారీగా తగ్గిన నీటిమట్టం
{Vేటర్‌లోని అన్ని మండలాల్లో
ఇదే దుస్థితి  {పైవేటు ట్యాంక ర్లే ఆధారం

 
సిటీబ్యూరో:  వేసవి రాకముందే మహా నగరంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రమాద  ఘంటికలు మోగుతున్నాయి. భవిష్యత్తు నీటి కష్టాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెబుతున్నాయి. నగరంలో 2014 జనవరిలో సగటున 7.33 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ దొరకగా.. ఈ ఏడాది అదే సమయానికి 9.91 మీటర్ల లోతుకు తవ్వితేగానీ గంగచిరునామా దొరకడం లేదు. గత ఏడాది కంటే 2.58 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. శివారుల్లోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో బోరుబావులు చుక్క నీరు లేక బావురుమంటున్నాయి. అపార్ట్‌మెంట్ వాసులు భారీ మొత్తం వెచ్చించి నీటిని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంటోంది.
 
అన్ని మండలాల్లోనూ అంతే...

గ్రేటర్ పరిధిలోని అన్ని మండలాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు అనూహ్యంగా తగ్గాయి. అత్యధికంగా ఘట్‌కేసర్ మండలంలో  11.75 మీటర్లు తగ్గాయి. హయత్ నగర్‌లో 9.05 మీటర్లు, నాంపల్లిలో 8.97, ఆసిఫ్‌నగర్‌లో 6.21, బండ్లగూడలో 2.40, చార్మినార్‌లో 2.72, మారేడ్‌పల్లిలో 3.51, శేరిలింగంపల్లిలో 0.45, సైదాబాద్‌లో 2, ఖైరతాబాద్‌లో 0.35, కుత్బుల్లాపూర్‌లో 0.20, సరూర్‌నగర్‌లో 4.95, ఉప్పల్‌లో 4.25, బాలానగర్‌లో 2.70, మల్కాజ్‌గిరిలో 1.41, రాజేంద్రనగర్‌లో 1.35, శేరిలింగంపల్లిలో 0.70 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గాయి.

అపార్ట్‌మెంట్లకు తప్పని కష్టం

గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని 900 కాలనీలు, బస్తీల్లోని బోరుబావుల్లో నీటి మట్టాలు పడిపోయాయి.  స్థానికులు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించి... జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఉదాహరణకు 22 ఫ్లాట్స్ ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో రోజుకు ఐదువేల లీటర్ల సామర్థ్యం గల ఏడు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నట్లు అంచనా. ఒక్కో ట్రిప్పునకు రూ.550 వంతున వెచ్చిస్తున్నారు. అంటే రోజుకు రూ.3,850 అన్న మాట. ఈ లెక్కన నెలకు ప్రైవేటు ట్యాంకర్ల నీటికి రూ.1,15,500 చెల్లించక తప్పని దుస్థితి. ఒక్కో ఫ్లాట్ యజమాని ప్రతినెలా నీటి కోసం రూ.5250 వంతున ఖర్చు చేయక తప్పడం లేదు. వేసవిలో ట్యాంకర్ల ట్రిప్పులు పెరిగితే ఈ ఖర్చు కూడా భారీగా పెరుగుతుందని అపార్ట్‌మెంట్ల వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇక 22 ఫ్లాట్స్‌కు మించి ఉన్న బహుళ అంతస్తుల భవంతుల్లో రోజుకు సగటున పది నుంచి పదిహేను ట్యాంకర్ల నీరు అవసరం ఉంటుంది. రాబోయే మూడు నెలల్లో ట్యాంకర్ నీళ్ల ఖర్చు ఇంటి బడ్జెట్‌ను మించిపోతుందని శివారు వాసులు ఆందోళన చెందుతున్నారు.
 
నెల రోజుల్లోనే 2.41 మీటర్ల లోతుకు...  

నగర వ్యాప్తంగా 2014 డిసెంబరు నెలాఖరున సగటున 7.50 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ దొరకగా.. జనవరి చివరికి  9.91 మీటర్ల లోతునకు వెళితే గానీ పాతాళ గంగ జాడ దొరక  లేదు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే గ్రేటర్ పరిధిలో పాతాళగంగ 2.41 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం.  

ఇంకుడు గుంతలు లేనందునే...

కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్‌లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, కార్యాలయాల వద్ద ఇంకుడు గుంతలు (రీచార్జింగ్ పిట్స్) లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో 60 శాతం వర్షపు నీరు వృథాగా పోతోందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం వృథా కావడం సర్వసాధారణమే. నగరంలో అదనంగా మరో 20 శాతం నీరు వృథాగా పోతోంది. దీనిలో సింహభాగం భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో రెండు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని వదులుకుంటున్న పాపం జీహెచ్‌ఎంసీ, జలమండలి విభాగాలదేనన్నది సుస్పష్టం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement