రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్న సాధారణ బదిలీలు ఈ ఏడాది కూడా ఉండే అవకాశం కనిపించడం లేదు.
- ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాదీ నిరాశే
- స్పౌస్ కేటగిరీలో మాత్రమే అనుమతిస్తూ సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్న సాధారణ బదిలీలు ఈ ఏడాది కూడా ఉండే అవకాశం కనిపించడం లేదు. కేవలం భార్యాభర్తల (స్పౌస్) కేటగిరీలో మాత్రమే ఈ ఏడాది బదిలీలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సంతకం చేశారు. ఈ బదిలీల షెడ్యూల్, విధి విధానాలు ఒకటి రెండు రోజుల్లో జారీకానున్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం కొనసాగుతోంది.
ఈ నిషేధాన్ని సడలించి సాధారణ బదిలీలకు అవకాశమివ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. కానీ తొలి నుంచీ సాధారణ బదిలీల అంశంపై ముఖ్యమంత్రి విముఖంగా ఉన్నారు. కానీ వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలకు ఒకే ప్రాంతంలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో.. స్పౌస్ కేటగిరీలో బదిలీలకు మాత్రం అనుమతించారు. ఇందుకు వీలుగా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బదిలీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు నిరాశే ఎదురవుతోంది.