చాంబర్ కోసం మంత్రుల మధ్య పేచీ..! | fight for chamber | Sakshi
Sakshi News home page

చాంబర్ కోసం మంత్రుల మధ్య పేచీ..!

Dec 21 2014 1:49 PM | Updated on Jul 28 2018 6:24 PM

చాంబర్ కోసం మంత్రుల మధ్య పేచీ..! - Sakshi

చాంబర్ కోసం మంత్రుల మధ్య పేచీ..!

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ‘డీ’ బ్లాక్‌లోని ఒక చాంబర్ కోసం ఇద్దరు మంత్రులు పోటీపడుతున్నారు.

ఒకే చాంబర్ కోసం పట్టుబడుతున్న ఇద్దరు
కార్యాలయం చూస్తామని తాళంచెవి తీసుకున్న మంత్రి బంధువులు


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ‘డీ’ బ్లాక్‌లోని ఒక చాంబర్ కోసం ఇద్దరు మంత్రులు పోటీపడుతున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తలనొప్పి కలిగిస్తోంది. చాంబర్ల కేటాయింపు అధికారం ముఖ్యమంత్రిదే అయినా, ఒక మంత్రి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చాంబర్ చూడడం కోసం తాళాలు తీసుకున్న మంత్రి సంబంధీకులు ఆ తాళాలు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. దీంతో  కార్యాలయం అధికారికంగా కేటాయించకుండా అందులో కూర్చోవడానికి వీల్లేదని, అలా చేయడం సరికాదని ఆ అధికారి స్పష్టం చేయడంతో సదరుమంత్రి సంబంధీకులు ఆ తాళం చెవులు తిరిగి ఇచ్చినా..అర్ధరాత్రి సమయంలో ఫోన్‌చేసి నానా గొడవ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

తెలంగాణ మంత్రులకు సచివాలయంలోని‘డీ’ బ్లాక్‌లో  చాంబర్లను కేటాయిస్తున్నారు. ఈనెల 16 న జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులుగా పదవీస్వీకార ప్రమాణం చేసిన సంగతి విదితమే. అయితే ఇందులో ఇద్దరు మంత్రులు ‘డీ’ బ్లాక్‌లోని రెండో అంతస్తులోని రూమ్ నంబర్ 260ని తమకు కేటాయించాలంటూ పట్టుబడుతున్నారు. గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే చాంబర్‌ను కోరుతున్నట్టు తెలిసింది. కాగా, ఈ చాంబర్‌ను పరిశీలిస్తామంటూ గిరిజన సంక్షేమశాఖ మంత్రి బంధువులు తాళం చెవులు తీసుకుని వెళ్లారు.

ఆ చాంబర్‌ను తమకే కేటాయించాలంటూ పట్టుబట్టడంతో సదరు అధికారి.. చాంబర్ల కేటాయింపు తమ పరిధిలో లేదని, ముఖ్యమంత్రే ఆమోద ముద్రవేయాల్సి ఉంటుందని, ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు కావాల్సిన చాంబర్ తీసుకోవచ్చని సూచించినప్పటికీ వినకుండా సదరు మంత్రి కుమారుడు శుక్రవారం రాత్రి ఫోన్‌లోనే తిట్లదండకం అందుకున్నట్టు తెలిసింది. ‘నీవు తుమ్మలకు తొత్తుగా వ్యవహరిస్తున్నావు.. ఏమనుకున్నావో సస్పెండ్ చేయిస్తా...మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం’ అంటూ హెచ్చరించినట్టు తెలిసింది. కుమారునితోపాటు మంత్రి కూడా ఆ అధికారిపై మండిపడ్డట్టు తెలిసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్టు తెలిసింది.
 
చాంబర్ కోరింది వాస్తవం: చందూలాల్
సచివాలయం ‘డీ’ బ్లాక్‌లోని చాంబర్ నంబర్ 260ను కోరిన మాట వాస్తవమేనని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ చెప్పారు. అనువుగా ఉంటుందని ఆ చాంబర్ కోరానని, తనతోపాటు మరో ముగ్గురు మంత్రులు కూడా అదే చాంబర్ కోరినట్టు ఆయన తెలిపారు. అయితే దీనిపై ఎలాంటి వివాదం చేయలేదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement