రెండేళ్లు జీఎస్టీ మినహాయించండి | Exclude GST for two years | Sakshi
Sakshi News home page

రెండేళ్లు జీఎస్టీ మినహాయించండి

Sep 7 2017 2:12 AM | Updated on Nov 9 2018 5:56 PM

సాగు, తాగునీటి ప్రాజెక్టులు.. గృహ, రహదారుల నిర్మాణ పనులపై రెండేళ్లు జీఎస్టీ మినహాయింపు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది.

- ‘సాగు, తాగునీరు.. గృహ, రహదారుల’ ప్రాజెక్టులపై..
లేదంటే పురోగతిలో ఉన్నవి వదిలేయండి
9న జరిగే కౌన్సిల్‌కు తెలంగాణ కొత్త ప్రతిపాదనలు
 
సాక్షి, హైదరాబాద్‌: సాగు, తాగునీటి ప్రాజెక్టులు.. గృహ, రహదారుల నిర్మాణ పనులపై రెండేళ్లు జీఎస్టీ మినహాయింపు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. లేనిపక్షంలో పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను మినహాయించాలని విన్నవించనుంది. ఈ మేరకు ఈ నెల 9న హైదరాబాద్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ కొత్త ప్రతిపాదనలను లేవనెత్తనుంది. సాగు, తాగునీటి పథకాలు.. గృహ, రహదారుల నిర్మాణ పనులపై కేంద్రం 18 శాతం జీఎస్టీ విధించింది. అయితే ఈ నాలుగింటిపై జీఎస్టీ విధించొద్దని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తోంది.

గత కౌన్సిల్‌ సమావేశంలో ఈ విషయం ప్రధానంగా ప్రస్తావనకు రావటంతో 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించింది. అయితే వాటిపై జీఎస్టీ విధించటమే సరికాదంటూ కేంద్రం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు.. ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాజాగా మరోసారి పట్టుబట్టడం వల్ల 5 శాతం శ్లాబ్‌లో చెల్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. పెద్దగా లాభం ఉండదని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 5 శాతం శ్లాబ్‌లో చేరిస్తే కాంట్రాక్టర్లకే ఎక్కువ లాభమని, ప్రభుత్వానికి నష్టమేనని ఆర్థిక శాఖ తాజాగా అంచనా వేసింది.

నిర్మాణ రంగంలో వినియోగించే సామగ్రిపై చెల్లించిన పన్ను, ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ రూపంలో కాంట్రాక్టు సంస్థలకు చేరుతుంది. దీంతో ప్రభుత్వ ఖజనాకు లాభం లేని ఈ ప్రతిపాదనను పక్కకు పెట్టింది. దానికి బదులుగా ఈ 4 అంశాలకు రెండేళ్లు జీఎస్టీని మినహాయించాలని, లేదంటే పురోగతిలో ఉన్నవి వదిలేసి, కొత్త పనులకే వర్తించే వెసులుబాటు కోరాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement