
రాజీనామా చేయను: మంత్రి తుమ్మల
రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్ తనను పాలేరు ఉప ఎన్నికల బరిలో నిలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్: రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్ తనను పాలేరు ఉప ఎన్నికల బరిలో నిలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏకగ్రీవ ప్రయత్నాల గురించి తెలియదన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో మంత్రి పదవికి గానీ, ఎమ్మెల్సీ పదవికి గానీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని 'సాక్షి'తో తుమ్మల నాగేశ్వరావు అన్నారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేయాలని కేసీఆర్ స్వయంగా తుమ్మలను కోరారు. కేసీఆర్ సూచనతో పోటీకి ఆయన అంగీకరించారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మలకు మంత్రి పదవిచ్చి, అనంతరం శాసన మండలికి పంపిన సంగతి తెలిసిందే.