పట్టాదారులు వర్సెస్‌ కౌలు రైతులు | Demands to reduce the lease | Sakshi
Sakshi News home page

పట్టాదారులు వర్సెస్‌ కౌలు రైతులు

Apr 20 2018 12:37 AM | Updated on Oct 1 2018 2:19 PM

Demands to reduce the lease - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తుంది. ఉగాది నాటికే కౌలు ఒప్పందాలు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ అనేక గ్రామాల్లో అటువంటి సందడే కనిపించడంలేదు. రైతుబంధు పథకంతో గ్రామాల్లో పట్టాదారులకు, కౌలు రైతులకు మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతుంది.

కౌలును ఖరారు చేసుకునేందుకు రైతులు ప్రయత్నిస్తుంటే, కౌలుదార్లు ముందుకు రావడం లేదు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తున్నందున ఆ మేరకు కౌలు తగ్గించుకోవాలని కౌలు రైతులు పట్టాదారులను కోరుతున్నారు. అందుకు పట్టాదార్లు ససేమిరా అంటున్నారు.

పెట్టుబడి సాయానికి, కౌలుకు ముడిపెట్టడం సరికాదని భూ యజమానులు అంటున్నారు. తమకు పెట్టుబడి సాయం రావట్లేదు కాబట్టి కౌలు తగ్గించాల్సిందేనని కౌలుదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కౌలు ఒప్పందాలు నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కౌలు ఒప్పందాలు ఖరీఫ్‌లో జరుగుతాయా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఈ కిరికిరితో అనేక చోట్ల పట్టాదారు రైతులు కౌలుకు ఇవ్వకుండా వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు.

85 శాతం సన్న, చిన్నకారు రైతులే..
రాష్ట్రంలో చాలామంది రైతులు తమకున్న భూమికి తోడు మరికొంత కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలు కూడా కౌలు చేస్తుంటారు. మరోవైపు పెద్ద, మధ్య తరగతి రైతులు వ్యాపారం, ఉద్యోగం తదితర కారణాలతో తమ భూమిని కౌలుకు ఇచ్చి పట్టణాలకు వలస వెళ్తుంటారు.

బ్యాంకర్ల కమిటీ తేల్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 14లక్షల మంది కౌలు రైతులున్నారు. అంతేకాదు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 40 శాతం మంది వరకు వారే ఉన్నారు. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 61.96 శాతం మంది సన్నకారు రైతులే. వీరి చేతిలో సరాసరి ఎకరా నుంచి రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇక చిన్నకారు రైతులు 23.90 శాతం మంది ఉన్నారు.

వారి చేతిలో సరాసరి రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకు భూమి ఉంది. అంటే 85.86 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. కౌలు రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. వారికి ప్రైవేటు అప్పులే దిక్కు. ఇంత కష్టపడ్డాక తనకు లాభం వచ్చినా రాకున్నా పంట అనంతరం భూ యజమానికి కౌలు చెల్లిస్తారు.  

నష్టపోయేది కౌలు రైతులే..
రైతుబంధు పథకం కింద భూ యజమానికి పెట్టుబడి సాయంతోపాటు కౌలు సొమ్ము కూడా అదనంగా అందుతుంది. ఇక్కడ సాగు ఖర్చు అంతా భరించి నష్టపోయేది కౌలు రైతేనన్న చర్చ జరుగుతోంది. ఇంతటి గణనీయ సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు పెట్టుబడి పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాయం చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పడంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పట్టాదారులతో కౌలుదారులు పంచాయితీకి దిగుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement