పదవులకు దళితులు అనర్హులా? | Dalits are ineligible for positions? | Sakshi
Sakshi News home page

పదవులకు దళితులు అనర్హులా?

Apr 21 2016 2:02 AM | Updated on Oct 9 2018 7:11 PM

దళితురాలినైన తనకు డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పదవి చేపట్టడానికి అన్ని అర్హతలున్నాయని, అయినా ఆ పదవి ఎందుకు ఇవ్వలేదని దళిత మహిళా

♦ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి దళిత మహిళా ప్రొఫెసర్ లేఖ
♦ విచారణకు ఆదేశించిన పూనం మాలకొండయ్య!

 సాక్షి, హైదరాబాద్: దళితురాలినైన తనకు డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పదవి చేపట్టడానికి అన్ని అర్హతలున్నాయని, అయినా ఆ పదవి ఎందుకు ఇవ్వలేదని దళిత మహిళా ప్రొఫెసర్ డా.డి.రాజ్యలక్ష్మీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె కాకినాడ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గైనకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రొఫెసర్ల సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్నారు. సీనియారిటీని బట్టి ఈమెకు వైద్య విద్యా సంచాలకురాలి(డీఎంఈ)గా అవకాశం ఇవ్వాలి.

అర్హతలున్నప్పటికీ పదవి దక్కకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు తాజాగా లేఖాస్త్రం సంధించారు. తనకు అత్యున్నత పదవి ఇవ్వకపోవడానికి గల కారణాలు తెలియజేయాలని ఆమె లేఖలో కోరినట్లు తెలిసింది. సీనియారిటీ పరంగా తనకంటే జూనియర్‌లకు డీఎంఈగా అవకాశం ఇచ్చారని రాజ్యలక్ష్మీ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పదోన్నతుల వ్యవహారంపై పూనం మాలకొండయ్య విచారణకు ఆదేశించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్ల సీనియారిటీ జాబితాను రూపొందించి ఇవ్వాలని ఆమె సూచించినట్లు వెల్లడించాయి.
 
 మంత్రి తీరుపై అసంతృప్తి సెగలు
 మంత్రి కామినేని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న దళిత ప్రొఫెసర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి తనకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టడానికి ఇదేమైనా ఆయన సొంత ఆస్తా? అని విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలకు చెందిన ఒక సీనియర్ వైద్యుడు ప్రశ్నించారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, కామినేని శ్రీనివాస్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాకే ఇలా జరుగుతోందని కర్నూలు వైద్య కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement