‘108’ అంబులెన్సులపై నిరంతర నిఘా | Continued vigilance on the '108' Ambulances | Sakshi
Sakshi News home page

‘108’ అంబులెన్సులపై నిరంతర నిఘా

Feb 24 2016 3:28 AM | Updated on Oct 9 2018 7:11 PM

‘108’ అంబులెన్సులపై నిరంతర నిఘా - Sakshi

‘108’ అంబులెన్సులపై నిరంతర నిఘా

అత్యవసర వైద్య సేవలు అందించే ‘108’ అంబులెన్సులపై నిరంతర తనిఖీలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ
 
 సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సేవలు అందించే ‘108’ అంబులెన్సులపై నిరంతర తనిఖీలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ అంబులెన్సుల వైద్య సేవలకు సంబంధించి కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ బుద్ధప్రకాశ్ ఎం.జ్యోతి ఇటీవల జిల్లాలకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 337 అంబులెన్సులు ‘108’ కింద అత్యవసర వైద్య సేవల్లో పాలుపంచుకుంటున్నాయన్నారు.

ఒక్కో అంబులెన్సు ప్రతీ రోజూ నాలుగు అత్యవసర కేసుల బాధితులను ఆసుపత్రులకు చేరవేస్తుందన్నారు. అయితే నాలుగే కాకుండా ఇంకా కొన్ని కే సుల్లో బాధితులను తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. రోజువారీ పర్యవేక్షణతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. అందుకోసం ప్రాంతీయ వైద్యాధికారి (ఆర్‌డీ), జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో), సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సీనియర్ ప్రజారోగ్యాధికారి తనిఖీలు చేయాలని ఆదేశించారు. తన జోన్ పరిధిలో నెలకు కనీసం 10 శాతం అంబులెన్సుల పనితీరును ఆర్‌డీ తనిఖీలు చేయాలన్నారు. డీఎంహెచ్‌వో నెలకు 25 శాతం తనిఖీ చేయాలన్నారు.

సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సీనియర్ ప్రజారోగ్యాధికారి నెలలో ప్రతీ అంబులెన్సును తనిఖీ చేయాలన్నారు. తనిఖీల నివేదికను తనకు పంపించాలని ఆదేశించారు. గర్భిణి కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ వివరాలతో సహా ప్రతీ నెల ఒకటో తేదీన తన పరిధిలోని పర్యవేక్షణ సెల్‌కు మెయిల్ ద్వారా పంపించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. అలాగే ప్రతీ నెల జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశమై 108 పనితీరుపై చర్చించి అందుకు సంబంధించిన మినిట్స్‌తో నివేదికను పంపించాలన్నారు. రాష్ట్ర స్థాయిలోని నోడల్ ఆఫీసర్ జిల్లాల్లో పర్యటిస్తే కనీసం ఒక్క అంబులెన్సునైనా తనిఖీ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement