
విద్యార్థి దశ నుంచే ‘బాబు’కు కుల గజ్జి
విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు కుల గజ్జి ఉందని, రాష్ట్రంలో ఆయన్ని మించిన కులతత్వవాది లేరని శాసన మండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలు సి.రామచంద్రయ్య, శైలజానాథ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు కుల గజ్జి ఉందని, రాష్ట్రంలో ఆయన్ని మించిన కులతత్వవాది లేరని శాసన మండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఆఖరుకు పరిపాలనా పరంగా సీఎం కార్యాలయంలోనూ ఏ కులం వారు ఎక్కువగా ఉన్నారో చూడాలని సూచించారు. మాజీ మంత్రి శైజలనాథ్‌తో కలిసి ఆయన బుధవారం ఇందిర భవన్‌లో మీడియాతో మాటాడారు. బీసీ వర్గాల నేత ఆర్.కృష్ణయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లో ఓట్లు దండుకొని ఆయనకు కనీస మర్యాద కూడా ఇవ్వకపోవడమే అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును తిట్టాలంటే మోత్కుపల్లి నరసింహులును, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టాలంటే వర్ల రామయ్య, రావెల కిషోర్‌బాబు, అదేవిధంగా ఎమ్మెల్యే రోజానైతే పీతల సుజాత చేత తిట్టిస్తూ చంద్రబాబు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. తుని సంఘటపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబుకు నిజంగా పేదలపై అంత ప్రేమ ఉంటే అధికార పగ్గాలను ఆ వర్గాలకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు.