నేరుగా ఓటింగ్‌కే
రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగా ఓటింగ్‌కే వెళ్లనున్నారు
- మా నేతలంతా సీనియర్లే..
- మాక్ పోలింగ్ అక్కర్లేదు: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగా ఓటింగ్‌కే వెళ్లనున్నారు. యూపీఏ అభ్యర్థి మీరాకుమార్ వచ్చిన సందర్భంగానే గాంధీభవన్‌లో ఓటింగ్ విధానంపై పార్టీకి చెందిన సీనియర్లు సూచనలు చేశారు. పార్టీలో ఒకరిద్దరు మినహా అందరూ సీనియర్ సభ్యులే కావడం వల్ల మాక్ పోలింగ్ అవసరం లేదని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలంతా సోమవారం ఉదయమే ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్లుగా పార్టీ ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి వ్యవహరించనున్నారు.
సీఎం ఓటు మీరాకే: సంపత్
తెలంగాణ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో వందశాతం తన ఓటును యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌కే వేస్తారని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. మీరాకుమార్‌ను కాదని ఓటు వేయడానికి సీఎం మనస్సాక్షిఒప్పుకోదన్నారు. రాజకీయ, ఇతర అవసరాల కోసం బీజేపీ నేత రాంనాథ్ కోవింద్‌కు ఓటేయాలని బయటకు చెప్పినా కేసీఆర్ మనస్సాక్షి అందుకు అంగీకరించదని తెలిపారు.