ఏపీఎస్‌ఆర్టీసీ కేంద్ర కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు నిర్ణయం తీసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
27కు విజయవాడ రావాల్సిందేనని యాజమాన్యం ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: ఏపీఎస్‌ఆర్టీసీ కేంద్ర కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు నిర్ణయం తీసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నెల 27 కల్లా ఆర్టీసీ ఉద్యోగులు విజయవాడలోని ఎన్టీఆర్ ప్రధాన పరిపాలనా కార్యాలయాని(పండిట్ నెహ్రూ బస్ స్టేషన్)కి తరలి రావాలని ఎండీ నండూరి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేయడంపై యూనియన్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆస్తుల పంపకాలు పూర్తి కాకుండా ఉద్యోగుల్ని తరలిస్తే హైదరాబాద్‌లోని ఆస్తులపై వాటా కోల్పోయే ప్రమాదం ఉందంటూ గుర్తింపు సంఘమైన నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయమై ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, శ్రీనివాసరావు శనివారం విజయవాడలో ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావును కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ నెల 17న ధర్నాలు.. దీక్షలు...: ఆర్టీసీ ఉద్యోగుల తరలింపు, ఉమ్మడి ఆస్తుల విషయంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న బస్‌భవన్ వద్ద భోజన విరామంలో ధర్నాలు, రాష్ట్రంలోని అన్ని యూనిట్లలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని ఎన్‌ఎంయూ పిలుపునిచ్చింది. ఆస్తులు, ఉద్యోగుల విభజనకు వేసిన కమిటీ ఇంతవరకు సమావేశం కాలేదని, ఈ స్థితిలో ఏకపక్ష నిర్ణయం సరికాదని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పద్మాకర్, దామోదర్‌రావులు పేర్కొన్నారు.