సామాన్యులను పట్టించుకోలేదు

సామాన్యులను పట్టించుకోలేదు - Sakshi


సినీ నటుడు నారాయణ మూర్తి

 

కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సామాన్యులను విస్మరించి, సంపన్నులకు మేలు చేకూర్చేలా ఉందని  సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆదివారం సీపీఎం రాష్ట్ర  మహా సభల్లో మాట్లాడుతూ మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు భారంగా మారిందన్నారు. కమ్యూనిస్టు పార్టీలు సంఘటితమై మోడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు ఉపాధి కల్పించడంలో ముందుందన్నారు.



రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కాల్ లెటర్, ఉద్యోగం కళాకారులకే ఇవ్వడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పీఎన్‌ఎం రాష్ట్ర నాయకులు జగ్గారాజు, నర్సింహులు, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, సుద్దాల అశోక్, మాదాల రవి, సీపీఐ నాయకులు ప్రతాప్‌రెడ్డి, భూపతి వెంకటేశ్వర్లు,రమేష్, మిమిక్రీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు దుర్గా నాయక్, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి, బండ్రు నర్సింహులు,  మల్లు స్వరాజ్యం, జైని మల్లయ్య గుప్తా, రత్నం, అబ్బగాని భిక్షం, చుక్క సత్తయ్య, గూడ అంజయ్య, సత్యనారాయణ, దాసు, నర్సయ్య, సోనెరావు, శ్రీనివాసరెడ్డి తదితరులను సత్కరించారు.

 

ఎర్రజెండా రెపరెపలు

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సీపీఎం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండప పరిసర ప్రాంతాలు ఎరుపువర్ణాన్ని సంతరించుకున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రాంగణ వద్ద ఏర్పాటు చేసిన స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం జెండాను ఆవిష్కరించారు.  



కార్యక్రమంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్  కారత్, కేంద్ర కమిటీ సభ్యులు బేబి, శ్రీనివాసరావు, పాటూరి రామయ్య,  పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి.మధు, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎస్‌యూసీఐ నాయకులు బండ నరేందర్, ఎంసీపీఐ నాయకులు మద్దికాయల అశోక్ తదితరులు పాల్గొన్నారు.  సభకు సీపీఎం రాష్ట్ర నాయకులు జి.రాములు, సుదర్శన్, చుక్కా రాములు, జ్యోతి, జూలకంటి రంగారెడ్డి అధ్యక్షత వహించారు.

 

డప్పు కొట్టారు..చెప్పులు కుట్టారు..

సాక్షి,సిటీబ్యూరో: సీపీఎం రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా నిజాంకాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కళా ప్రాంగణాలు,  ఎగ్జిబిషన్లు ఆకట్టుకున్నాయి.  ‘బండెనుక బండి యాదగిరి కళా ప్రాంగణాన్ని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి ప్రారంభించారు. తెలంగాణ వంటలు, రుచుల ప్రదర్శనను రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పుస్తక ప్రదర్శనను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, చేతి వృత్తుల ఎగ్జిబిషన్‌ను ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, భూక్యా బంగ్యా, చిత్రకారుల ప్రదర్శనను సీపీఎం నేత మల్లు స్వరాజ్యం, షార్ట్ ఫిల్మ్, కార్టూనిస్టుల ఎగ్జిబిషన్లను కార్టూనిస్టు శంకర్, మోహన్, తెలంగాణ సాయుధ ఎగ్జిబిషన్‌ను మల్లు స్వరాజ్యం, ఛాయా చిత్ర ప్రదర్శనను దశరథ్‌కుమారు,  సాంస్కృతిక ప్రదర్శనను సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, కాళోజీ కళా ప్రాంగణాన్ని సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, యశ్‌పాల్ ప్రారంభించారు. అలాగే సీపీఎం నేతలు చేతి వృత్తుల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అలాగే పలువురు నేతలు డప్పులు కొట్టి..చెప్పులు కుట్టి సందడి చేశారు.

 

ఎవరేమన్నారంటే....

సాక్షి, సిటీబ్యూరో:  సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా ఆదివారం నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ జనజాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు నేతలు ప్రసంగించారు.

 

తెలంగాణ సంస్కృతికి నిదర్శనం

తెలంగాణ పల్లెలోని ప్రజా సంస్కృతి ప్రతిబింబించే విధంగా  జన జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబి అన్నారు.. చేతి వృత్తుల పరిరక్షణ కృషి చేస్తూనే....వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రదర్శనలు శ్రామిక జీవన విధానం ఉట్టి పడేలా ఉన్నాయని, పల్లెల్లో చేతి వృత్తి దారులు జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారని ఆయన కొనియాడారు.

 

కోటి ఆశల ఆకాంక్ష...: తమ్మినేని

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం  ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రజలు సంఘటిత ఉద్యమాలు చేపట్టాలన్నారు. అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు, వామపక్షాలు, కమ్యూనిస్ట్టులు సమష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

 

భూములను అమ్మనివ్వం: కంచె ఐలయ్య.

తెలంగాణ వస్తే బాగుపడుతుందనుకున్నాం.. వచ్చినంక డబ్బులన్ని గుళ్లు, గోపురాలకు పోతున్నాయని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. వాస్తు పేరుతో భూములు అమ్మాలని చూస్తున్నారని.... ప్రాణం పోయినా అందుకు అంగీకరించేది లేదన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top