
ఇక అద్భుత ఆర్థిక ప్రగతి
అద్భుత ఆర్థిక శక్తికి నిలయంగా ఉన్న తెలంగాణ పురోగతి అత్యంత గొప్పగా ఉండబోతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అద్భుత ఆర్థిక శక్తికి నిలయంగా ఉన్న తెలంగాణ పురోగతి అత్యంత గొప్పగా ఉండబోతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని, అది మరింతగా పెరగబోతోందని చెప్పారు. ఈ విషయం తాను చెబుతోంది కాదని, 14 వ ఆర్థిక సంఘమే స్పష్టం చేసిందని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 0.5 శాతానికి పెంచటం ద్వారా కేంద్రం కూడా దాన్ని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. ‘‘రెండుమూడు రోజుల క్రితం నేను కొందరు ఆర్థిక నిపుణులతో మాట్లాడాను. 2019 నాటికి తెలంగాణ వార్షిక బడ్జెట్ కనిష్టంగా రూ.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని వారు చెప్పారు.
సాధారణంగా ఐదేళ్లలో ఆయా రాష్ట్రాల బడ్జెట్ రెట్టింపవడం సాధారణం. కానీ తెలంగాణ ఆర్థిక పరిపుష్టి నేపథ్యంలో 2024 నాటికి బడ్జెట్ విలువ రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అదీ తెలంగాణ ఆర్థిక శక్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే అది ఆర్థిక శక్తిగా మారుతుందని నేను ముందు నుంచి చెప్తున్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి..’’ అని అన్నారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్‌ఐసీసీ)లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక వాస్తవాలు, లెక్కలకు ఒక ఆర్థిక సంవత్సరం అవసరమైందని, ఇప్పుడు విషయం పూర్తిగా పట్టుబడిందని, ఇక అద్భుత ఆర్థిక ప్రగతి మన సొంతమని అన్నారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఆకుపచ్చ తెలంగాణ చేసి తీరుతాం..
ట్రిబ్యునళ్లు, కోర్టులున్నాయి. వాటిల్లో వాదిస్తున్నాం. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. కేంద్రాన్ని ఒప్పించి, ట్రిబ్యునళ్ల దగ్గర వాదించి 2022 నాటికి కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి ఆకుపచ్చ తెలంగాణ చేసి తీరుతాం. ఈ సభా వేదిక ద్వారా ఏపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. మనం తెలుగు మాట్లాడే రాష్ట్రాల వాళ్లం, ఇరుగుపొరుగు వాళ్లం. మన మధ్య విద్వేషాలొద్దు. అలంపూర్ నుంచి భద్రాచలం వరకు సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు మనవి. నీటి తగాదాలొద్దు. రేపు మనం ఉండకపోవచ్చు. కానీ ప్రజలుంటారు.. రాష్ట్రాలుంటాయి. నదుల్లో నీటి లభ్యత ఉన్నందున రైతాంగం శ్రేయస్సు కోసం సామరస్య పూర్వకంగా సాగుదాం. గతంలో సమైక్య రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు. క ర్ణాటక నుంచి గుక్కెడు నీటిని తేలేకపోయింది. ఇప్పుడు తెలంగాణ మంచి వ్యవహారం కారణంగా అటు మహారాష్ట్రతో ఒప్పందం కుదిరి పనులు మొదలవుతున్నాయి. ఇటీవల సమస్య వస్తే కర్ణాటక జూరాలకు ఒక టీఎంసీ నీటిని ఇచ్చింది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందన్న పెద్దల మాట ఇక్కడ నిజమైంది.
గవర్నర్ నాకు మార్గనిర్దేశకులు
తెలంగాణను ఎలా అభివృద్ధిపథంలో ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు అని అడుగుతూ గవర్నర్ అడుగడుగునా సూచనలు సలహాలు ఇస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. గవర్నర్ పెద్దన్న తరహాలో నాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. విజ్ఞులు, మేధావులు ఇచ్చే సూచనల్నీ పరిగణనలోకి తీసుకుంటా.
చిన్న జిల్లాలు.. యువ కలెక్టర్లు
స్వాతంత్య్రానంతరం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరగని రాష్ట్రాలు రెండే. ఒకటి పశ్చిమబెంగాల్, రెండోది ఏపీ. రాష్ట్రాభివృద్ధి కోసం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాం. 15 లక్షల జనాభాకు ఒకటి చొప్పున చేసే ఆలోచనలో ఉన్నాం. ఈ ఏడాదే అవి మనుగడలోకి వస్తాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణలో పేదరికం ఉంది. ప్రస్తుతం రూ.36 వేల కోట్లను వివిధ పథకాల కింద పేదల లబ్ధికి ఖర్చు చేస్తున్నాం. ఇది తాత్కాలికమే. చిన్న జిల్లాలకు ఉత్సాహవంతులైన యువ కలెక్టర్లను నియమిస్తాం. వారికి ఆయా జిల్లాల కుటుంబాల పరిస్థితులపై అవగాహన ఉంటుంది. ఒక్కో పేద కుటుంబాన్ని చేరి ‘మీరు పేదగా’ ఉండొద్దు అని వారు చర్యలు తీసుకుంటారు. ఇదే విషయాన్ని నేను గవర్నర్ దృష్టికి తెచ్చా.
ఇక 24 గంటల కరెంటు
రాష్ట్రంలో ఇక కరెంటు కోతలుండవు. 24 గంటలపాటు త్రీఫేజ్ కరెంటు ఉంటుంది. 2018 తర్వాత నీటి కష్టాలు ఉండవు. 2022 తర్వాత కరువు రక్కసి తెలంగాణ వైపు చూసేందుకు కూడా భయపడుతుంది. రాజకీయ అవినీతి ఉండదు. కిందిస్థాయిలో ఉండే అవినీతిని పారదోలేందుకు పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తాం. అందుకు కొంత సమయం పడుతుంది. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించబోం. దాన్ని పరిపుష్టం చేస్తాం. కరెంటు ఉత్పత్తి టీఎస్ జెన్‌కో ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ప్రైవేటు ఉత్పత్తికి అనుమతించబోం. అలా అని ప్రైవేటుకు వ్యతిరేకం కాదు. అవసరమైన చోట్ల మాత్రమే ప్రైవేటుకు అవకాశం కల్పించి సమతూకంతో వ్యవహరిస్తాం.
మనం కోటి ఎకరాలకు నీళ్లు పారించుకోవద్దా?
గోదావరి, కృష్ణా నదుల్లో ప్రతి సంవత్సరం సగటున 4,200 టీఎంసీల పైచిలుకు నీళ్లు అందుబాటులో ఉంటున్నాయి. వీటితో నాలుగు కోట్ల ఎకరాలను పారించొచ్చు. తెలంగాణలో మనం పెట్టుకున్న లక్ష్యమెంత.. కోటి ఎకరాలు. మూడు కోట్ల ఎకరాల నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుని, కోటి ఎకరాల నీళ్లు తెలంగాణ వాడుకుంటామంటే లొల్లి ఎందుకో నాకు అర్థమైతలేదు. ఇంక గొడవెందుకో తెలుస్తలేదు. నీటి లభ్యతపై లెక్కలు నావి కాదు, 47 సంవత్సరాల కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కలు చెప్తున్నవే. ఇటీవల ఏపీ సీఎం, అక్కడి నేతలు చేస్తున్న ప్రకటనలు పత్రికల్లో చదివి కలత చెందుతారేమోనన్న ఉద్దేశంతో ప్రజలకు స్పష్టతనిచ్చేందుకు నేనీ లెక్కలు చెప్తున్నా. నేను చండీ యాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు అమరావతిలో ఆయన ఇంటికి వెళ్లినప్పుడే ఈ విషయాలు వివరించా. మీ నీళ్లు మీరు తీసుకోండి.. మా నీళ్లు మేం తీసుకుంటామని చెప్పా. అయినా ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారో అర్థం కావడం లేదు.