హమ్మయ్య.... | Clear the end of the Ganesh festival | Sakshi
Sakshi News home page

హమ్మయ్య....

Sep 29 2015 12:34 AM | Updated on Aug 21 2018 5:52 PM

హమ్మయ్య.... - Sakshi

హమ్మయ్య....

పదకొండు రోజులు పాటు జరిగిన గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

{పశాంతంగా ముగిసిన గణేశ్ ఉత్సవాలు
ఊపిరి పీల్చుకున్న నగర పోలీసులు
 
సిటీబ్యూరో: పదకొండు రోజులు పాటు  జరిగిన గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూడటంతో పాటు సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నగరవాసులకు పోలీసులు మరింత దగ్గరయ్యారు. వినాయక చవితి, బక్రీద్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒకే నెలలోనే రావడంతో... ఎక్కడేం జరుగుతుందోనని తొలుత ఆందోళన చెందిన పోలీసులు పక్కా ప్రణాళికతో బయటి రాష్ట్రాలు, కేంద్రం నుంచి బలగాలు రప్పించి భద్రతను కట్టుదిట్టం చేశారు. బక్రీద్, వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 శభాష్ పోలీస్...
 బక్రీద్ పండుగ రోజున జంతువుల వ్యర్థాలను బ్యాగుల్లో వేసి కంటైనర్లలో వేసేందుకు ఇంటింటికీ భారీసైజు ప్లాస్టిక్ బ్యాగులను బల్దియా ఆరోగ్య అధికారులతో కలిసి పోలీసులు పంపిణీ చేశారు. వినాయక మండపాల వద్దకు ఈ జంతువుల వ్యర్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఈద్గాల వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేసి ఎక్కడా ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ‘హుమాయున్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని విజయ్‌నగర్ కాలనీ ఫుట్‌బాల్ మైదానం వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద బక్రీద్ రోజున ముస్లిం యువకులు జంతువుల వ్యర్థాలను తీసుకెళ్తున్న ప్లాస్టిక్ బ్యాగ్ జారి కింద పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే సదరు స్టేషన్ సిబ్బంది ఒకరు అక్కడికి చేరుకుని స్థానికులతో ఆ వ్యర్థాలను మండపం వైపు రాకుండా శుభ్రం చేయించారు. తాను కూడా నీళ్లు పోసి వారికి సహకరించారు.

ఎటువంటి ఘర్షణ జరగకుండా చూసుకున్నారు. ...ఇతనొక్కరే కాదు పోలీసులు అం దరూ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ స్ఫూర్తిని చాటి నగరవాసులకు మరింత దగ్గరయ్యారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనాల రాకపోకలను ఎప్పటికప్పడు గమనిస్తూ నిమజ్జనానికి వెళ్లే వాహనాలు వేగంగా కదిలేలా చొరవ తీసుకున్నారు. గణేశుడి శోభాయాత్ర మొదలుకొని నిమజ్జనం ముగిసే వరకు దాదాపు రోజున్నర పట్టినా...ఎక్కడా సహనం కోల్పోకుండా భక్తులకు మార్గ నిర్దేశనం చేశారు. ‘భగవంతుడి సేవలో భక్తులు’...‘భక్తుల సేవలో హైదరాబాద్ పోలీసులు’ అంటూ ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు సిబ్బంది చేసిన అనౌన్స్‌మెంట్లకు కూడా జనం కేరింతలు కొట్టడం కనిపించింది. పోలీసులకు భక్తులు, భక్తులకు పోలీసులు సహకరించుకునే దృశ్యాలు కనబడ్డాయి.  

 కమాండ్ కంట్రోల్ భేష్...
 నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి, ఎప్పటికప్పుడూ ఉన్నతాధికారులు పర్యవేక్షించి స్థానిక పోలీసులకు మార్గనిర్దేశనం చేశారు.  బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ఏర్పాటు చేసిన 400 సీసీటీవీ కెమెరాలు, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన 120 సీసీటీవీ కెమెరాలతో పాటు నగరవ్యాప్తంగా దాదాపు 2,000కు పైగా సీసీటీవీ కెమెరాల్లో గణేశుడి శోభాయాత్ర దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. అన్ని ప్రాంతాల్లో జరిగిన నిమజ్జన దృశ్యాలను వీక్షిస్తూ, అవసరమైన చోటికి అదనపు బలగాలను పంపించారు. నిమజ్జన యాత్ర సాఫీగా సాగేలా చూడటంలో పోలీసులు పైచేయి సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement