చలికి.. చాయ్ మందు..! | Chai is medicine to winter season | Sakshi
Sakshi News home page

చలికి.. చాయ్ మందు..!

Jun 30 2014 1:02 AM | Updated on Sep 4 2018 5:07 PM

చలికి.. చాయ్ మందు..! - Sakshi

చలికి.. చాయ్ మందు..!

‘‘డిసెంబర్ నెలలో హైదరాబాద్‌కి వెళితే...ఎముకలు కొంకర్లు తిరుగుతాయని చెబితే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏభైఅయిదేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చినపుడు నాకెదురయిన సంఘటన ఎప్పటికీ మరచిపోలేను.

 జ్ఞాపకం
 
‘‘డిసెంబర్ నెలలో హైదరాబాద్‌కి వెళితే...ఎముకలు కొంకర్లు తిరుగుతాయని చెబితే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏభైఅయిదేళ్ల  కిందట  హైదరాబాద్‌కి వచ్చినపుడు నాకెదురయిన సంఘటన ఎప్పటికీ మరచిపోలేను. వస్తూనే నాంపల్లి దగ్గరున్న ఇంపీరియర్ లాడ్జ్‌లో దిగాను. సాయంత్రం ఐదయ్యేసరికి చలి దాడి మొదలయ్యింది. అప్పటివరకూ లాడ్జి బయట తిరుగుతూ నేనొచ్చిన పని తాలూకు ప్రణాళిక గురించి ఆలోచిస్తున్నాను. చలి పెరగడంతో  రూమ్‌కు పరిగెట్టాను. మంచంమీదున్న బెడ్‌షీట్ తీసుకుని ఒళ్లంతా చుట్టేసుకున్నాను. లాభం లేదు....ఎవరో చల్లటినీళ్లను బెడ్‌షీట్‌పై చల్లుతున్న ఫీలింగ్. పళ్లన్నీ జివ్‌మంటున్నాయి. అడుగు ముందుకు పడడం లేదు.
 
ఇంకో బెడ్‌షీట్ ఇవ్వమని అడిగితే ఒక రూమ్‌కి ఒకే బెడ్‌షీట్ అన్నారు లాడ్జ్‌వాళ్లు. చాలాసేపు బతిమిలాడితే అతికష్టంమీద మరో బెడ్‌షీట్ ఇచ్చారు. ఈ గొడవంతా చూసిన లాడ్జ్ క్యాషియర్...‘హైదరాబాద్‌కి రావడం మొదటిసారా..’ అన్నాడు జాలిగా. కాదంటూ తలూపుతూనే...అవునని చెప్పాను. ఎందుకంటే అప్పటికి రెండేళ్ల ముందు తొలిసారి  వచ్చాను. అది వేసవికాలం కావడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. నాకు అప్పటివరకూ వేసవి తాపం గురించి తెలుసు. మండుటెండ, ముచ్చెమటలు వంటివి అనుభవమున్నాయి కానీ, ఒళ్లంతా గడ్డకట్టుకుపోయే చలి గురించి తెలీదు. ఆ అనుభవం హైదరాబాద్‌కి వస్తే ఉంటుందని అనేవారు కానీ నాకు ఇక్కడికి వచ్చాక గాని తెలియలేదు. ఆ చలిలో నా పాట్లు చూసి క్యాషియర్ దగ్గరికి పిలిచి ఓ సలహా ఇచ్చాడు. వంటిమీద నుంచి బెడ్‌షీట్ తీసి పక్కన పడేసి బయట రోడ్డుమీదకు వెళ్లి వరసగా రెండు ఇరానీ చాయ్ తాగొచ్చి పడుకుంటే వెచ్చగా ఉంటుందన్నాడు.
 
అతని మాటలు నాకు వైద్యంలా అనిపించాయి. నిజానికి అప్పటివరకూ నాకు టీ, కాఫీల గురించి తెలీదు. చలి తగ్గుతుందంటే ఏమైనా చేసేలా ఉంది నా పరిస్థితి. వెంటనే వెళ్లి రెండు టీలు తాగొచ్చి పడుకున్నాను. కొంచెం వాతావరణం వెచ్చబడిన ఫీలింగ్. ఆ రోజు నేనున్న రూమ్ కిరాయి రూపాయిన్నర. ఇక అక్కడి నుంచి చదువు, ఉద్యోగాలు,సాహిత్య కార్యక్రమాల పేరుతో ఏడాదిలో నాలుగైదు సార్లు హైదరాబాద్‌కి వచ్చేవాడ్ని.

ఎప్పుడొచ్చినా ఇంపీరియర్ లాడ్జ్‌లోనే మకాం. అద్దె సామాన్యులకు అందుబాటులో ఉండడం వల్ల తర్వాతర్వాత ఆ లాడ్జ్‌కి బాగా గిరాకి పెరిగిపోయింది. రూపాయిన్నర ఉన్న రూమ్ అద్దె మూడువేలకు పెరిగిందిప్పుడు. నలభైయాభై ఏళ్లక్రితం నగర వాతావరణానికీ, ఇప్పటికీ చాలా చాలా మార్పు వచ్చింది. నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన ‘మునివాహనుడు’ నాటకం, ‘ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం’ పుస్తకాన్ని ఇంపీరియర్ లాడ్జ్ రూములో కూర్చుని ఇరానీ చాయ్‌లు తాగుతూ రాశాను. చాయ్‌లు చలిని చంపుతుంటే...అక్కడి ప్రశాంతమైన వాతావరణం నాలోని రచయితని తట్టి తట్టి లేపుతుండేది.

భువనేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement