
రూ. 254 కోట్లతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 254 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ:
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 254 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టుల విషయంలో ఆయన సోమవారం కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 254 కోట్లు మంజూరు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించినట్టు తెలిపారు. ఈ ఏడాదికి రాష్ట్రానికి 31 కొత్త ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్టు గడ్కరీ చెప్పారన్నారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు ఉప్పల్ – నార్లపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ. 950 కోట్లు మంజూరు చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు.
ఎన్‌ఎండబ్ల్యూఏబీ చైర్మన్‌గా గోవర్ధన్
కేంద్ర ఉపాధి, కల్పన శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కార్మిక కనీస వేతన సలహా మండలి (ఎన్‌ఎండబ్ల్యూఏబీ) చైర్మన్‌గా బీజేపీ సీనియర్ నేత ఆవుల గోవర్ధన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో గోవర్ధన్‌ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ సన్మానించారు.
తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మిర్చి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయండని గత ఏడాది రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ మంత్రులు ప్రోత్సహించడంతోనే వారు ఎక్కువ మొత్తంలో సాగు చేశారని అందువల్లే పంటకు మద్దతు ధర లభించడంలేదని దత్తాత్రేయ పేర్కొన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌తో ఆయన చర్చలు జరిపారు. వాణిజ్య పంటలకు కేంద్రం మద్దతుధర నిర్ణయించలేదని, అయినా మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కేంద్రం కల్పించుకొని రూ. 5 వేలు ధర, రూ. 1,250 ఓవర్‌హెడ్ చార్జీలు ప్రకటించిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి పంటను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. అనంతరం రైతులను ఆదుకోవడానికి కేంద్రం తనవంతు సాయం చేస్తుందన్నారు.