Sakshi News home page

చైనా రసాయనాలు!

Published Fri, Apr 29 2016 2:03 AM

చైనా రసాయనాలు! - Sakshi

మామిడి పండ్లు మగ్గించేందుకు వినియోగం
దాడుల్లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు
ఇథిలీన్ వినియోగిస్తున్న గోడౌన్స్ నిర్వాహకులు
కార్బైడ్’ విక్రయాలపై కఠిన చర్యలకు శ్రీకారం
ఇద్దరు హోల్‌సేలర్స్‌పై దాడి, భారీగా స్వాధీనం

 
 
 
సాక్షి, సిటీబ్యూరో: హైకోర్టు ఆదేశాల మేరకు కాల్షియం కార్బైడ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన హైదరాబాద్ పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వ్యాపారులు ‘చైనా’ బాటపట్టారు. అక్కడ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న ఇథిలీన్ రైథ్మర్ అనే పౌడర్‌ను వాడుతున్నట్లు సౌత్‌జోన్ పోలీసులు గుర్తించారు. గురువారం భారీ స్థాయిలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ఈ ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. సీజన్ కావడంతో మామిడి పండ్లను మగ్గించేందుకు దీన్ని వాడుతున్నారని తేలింది. మరోపక్క కాల్షియం కార్బైడ్ విక్రయాలను సీరియస్‌గా తీసుకున్న డీసీపీ వి.సత్యనారాయణ గురువారం తొలిసారిగా ఇద్దరు హోల్‌సేలర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా సౌత్‌జోన్ పోలీసులు గురువారం పాతబస్తీలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలోని 9 పండ్ల గోడౌన్లపై దాడులు చేశారు. కొన్ని గోదాముల్లో ఇథిలీన్ రైథ్మర్ పేరుతో ఉన్న పౌడర్‌ను గుర్తించారు.

ఇథిలీన్ అనేది హాని చేయని కర్బన రసాయనమే అయినప్పటికీ... ఇలా పొడి రూపంలో గుర్తించడం తొలిసారని డీసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. దాని ప్యాకెట్లపై ఉన్న వివరాలను బట్టి చైనాలో తయారైనట్లు గుర్తించారు. కొత్తపేట పండ్ల మార్కెట్‌కు చెందిన కొందరు వ్యాపారులు దిగుమతి చేసుకుని, స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభించాయని, లోతుగా ఆరా తీస్తున్నామని డీసీపీ తెలిపారు. అసలు ఈ రసాయనంలో ఎలాంటి ఇంగ్రిడెంట్స్ ఉన్నాయి? వినియోగించడానికి ఉద్యానవన శాఖ, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? తదితరాలు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వీటిని నిర్థారించేందుకు శాంపిల్స్‌ను సేకరించి ఉద్యానవన శాఖకు పంపామన్నారు. వారి నివేదిక వస్తేనే ఈ రసాయనం ఎంత ప్రమాదకరమో తేలుతుందని పేర్కొన్నారు.


‘కార్బైడ్’ హోల్‌సేలర్స్‌పై దాడులు...
కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా పురానీహవేలిలోని దుర్రు షెహవర్ ఆసుపత్రి ఎదుట ఉన్న పండ్ల గోడౌన్‌లో తనిఖీలు చేశారు. తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఆయూబ్ అహ్మద్ ఖాన్ నిర్వహిస్తున్న ఈ గోదాములో ఈది బజార్‌కు చెందిన నసీర్ ఖాన్ పని చేస్తున్నాడు. వీరిద్దరూ కాల్షియం కార్బైడ్ వినియోగించి మామిడి పండ్లను మగ్గిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు రెండు కేజీల కార్బైడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్బైడ్‌ను శాలిబండలో ‘షా ఏజెన్సీస్’ నుంచి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సంస్థపై దాడి చేసిన పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 25 కేజీల కార్బైడ్ స్వాధీనం చేసుకుని యజమానికి అదుపులోకి తీసుకున్నారు.

ఇతడు కార్బైడ్‌ను అఫ్జల్‌గంజ్‌లోని శ్రీరామ ఏజెన్సీస్ నుంచి ఖరీదు చేసినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో గురువారం రాత్రి ఆ సంస్థపై దాడి చేసిన పోలీసులు యజమాని నందకిషోర్ లడ్డాను అదుపులోకి తీసుకుని అక్రమంగా నిల్వ ఉంచిన 20 టన్నుల కాల్షియం కార్బైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెల్డింగ్ పనుల కోసం ఉద్దేశించిన ఈ కార్బైడ్ ఘజియాబాద్ నుంచి నగరానికి అక్రమ రవాణా అవుతున్నట్లు ఆధారాలు లభించాయని, దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ పేర్కొన్నారు. ‘నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు కాల్షియం కార్బైడ్ అక్రమ సరఫరా మూలాలు కనిపెట్టడంపై దృష్టిపెట్టాం.

గోడౌన్లు, దుకాణాలపై చేస్తున్న దాడులతో పూర్తిస్థాయి ఫలి తాలు లేని నేపథ్యంలోనే కట్టడి కోసం ఈ చర్యలు తీసుకుం టున్నాం. నగరంలోని ఇతర అక్రమ విక్రేతల పైనా దాడులకు సన్నాహాలు చేస్తున్నాం. ఇథిలీన్ రైథ్మర్ పేరుతో ఉన్న పౌడర్‌పై ఉధ్యానవన శాఖ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని డీసీపీ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement