మరో మృతదేహం వెలికితీత | building collapse rescue underway of in nanakramguda | Sakshi
Sakshi News home page

మరో మృతదేహం వెలికితీత

Dec 9 2016 9:52 AM | Updated on Sep 4 2017 10:18 PM

మరో మృతదేహం వెలికితీత

మరో మృతదేహం వెలికితీత

కుప్పకూలిన భవనం శిథిలాల్లో ఇరుక్కున్న వారిని కాపాడడానికి రెస్క్యూ టీమ్ శ్రమిస్తోంది.

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, మరో 8మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా మృతులను శివ, నారాయణమ్మ, పైడమ్మ, గౌరీశ్వరిగా గుర్తించారు. శివ తప్ప మిగతా వారంతా విజయనగరం జిల్లా వాసులుగా తేలింది. శిథిలాల కింద ఇరుక్కున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ మహిళ, చిన్నారిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించగలిగింది.

టోలిచౌకి ప్రాంతానికి చెందిన తుల్జాపూర్‌ సత్యనారాయణ సింగ్‌ ఈ భవనం యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్‌ 6 (ఏడు అంతస్తులు)తో పాటు పైన పెంట్‌హౌస్‌ కూడా నిర్మిస్తున్నారు. 2015 సెప్టెంబర్‌ నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోందని, నిర్మాణంలోని  ఆ భవనంలోనే జిల్లాల నుంచి వచ్చిన 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు జేసీబీలు, క్రేన్‌లతో ప్రయత్నిస్తు న్నారు. భవనం వద్దకు వెళ్లేదారి ఇరుకుగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితరులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందిం చేందుకు సమీప ఆసుపత్రుల నుంచి అంబులెన్స్‌లను రప్పించారు.

ఎందుకు కూలిపోయింది?
లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని కొందరు స్థానికులు చెబుతుండగా... ఆ భవనానికి వెనుక మరో భవన నిర్మాణం కోసం బాంబులతో పేల్చి సెల్లార్‌ గుంత  తీస్తుండడమే  ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా సత్యనారాయణసింగ్‌ భవనం కుప్పకూలిపోవడంతో.. ఆ ధాటికి పక్కనే ఉన్న తుల్జాపూర్‌ వీరేంద్రసింగ్‌కు చెందిన రెండస్తుల భవనం బీటలు వారి, కొంత మేర దెబ్బతిన్నది. వీరేంద్రసింగ్‌ కుమార్తెలకు స్వల్ప గాయాలయ్యాయి.

విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌
నానక్‌రామ్‌గూడలో భారీ భవంతి కుప్పకూలడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్, జీహెచ్‌ఎంసీ  కమిషనర్లతో ఫోన్‌లో మాట్లాడారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

యజమాని గుడుంబా డాన్‌!
నానక్‌రామ్‌గూడలో కుప్పకూలిన భవనం యాజమాని తుల్జారాం సత్యనారాయణసింగ్‌ అలియాస్‌ సత్తూ సింగ్‌ ఆ ప్రాంతంలో గుడుంబా డాన్‌ అని తెలిసింది. కూలిన భవనానికి ఎదురుగా సత్తు సింగ్‌కు ఆరు అంతస్తుల  మరో భవనం ఉంది. అతను రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో గుడుంబా అక్రమ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. ఇక కూలిపోయిన భవనానికి జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులూ లేవు. గుడుంబా అ క్రమ వ్యాపారం నిర్వహిస్తుండగా కేసులు నమోదు చేసిన పోలీస్‌ అధికారులపై సత్తూ సింగ్‌ ఎన్నోసార్లు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. సత్తూసింగ్‌ కుమారుడు అనిల్‌సింగ్‌ జీహెచ్‌ఎంసీ ఎ న్నికల్లో గచ్చిబౌలి కార్పొరేటర్‌ స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement