బావి నుంచి సింహ గర్జన.. చివరికి జరిగింది ఇదే..! | Lion Rescued From Well In Gujarat After Dramatic Hour Long Operation | Sakshi
Sakshi News home page

బావి నుంచి సింహ గర్జన.. చివరికి జరిగింది ఇదే..!

Apr 14 2026 5:49 PM | Updated on Apr 14 2026 7:07 PM

Lion Rescued From Well In Gujarat After Dramatic Hour Long Operation

‘పదిహేను అడుగుల లోతు బావిలో పడ్డ సింహం.. గంటపాటు సాగిన సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్..’ గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బావిలో చిక్కుకున్న ఒక సింహాన్ని అటవీ శాఖ అధికారులు దాదాపు గంటసేపు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. ఏప్రిల్ 13న నవబందర్ అటవీ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది.

అటవీ అధికారుల తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ సింహం ఆహారం వేటలో తన నివాసం నుండి బయటకు వచ్చి.. ప్రమాదవశాత్తు నీటి బావిలో పడిపోయింది. బయటకు రాలేక.. తీవ్రంగా పోరాడింది. సింహం గర్జనలు చుట్టుపక్కల ప్రాంతాలకు వినిపించడంతో స్థానికులు అప్రమత్తమై.. అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జసాధర్ అటవీ శాఖ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ చౌహాన్ నేతృత్వంలో రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దిగింది. సింహం బావిలో పడిందన్న వార్త తెలియగానే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

అటవీ సిబ్బంది బలమైన తాళ్లను బావిలోకి దించారు. సింహం వాటిని పట్టుకుంటుందని పైకి లాగడానికి వీలుగా ఉంటుందని భావించారు. అయితే, భయపడిపోయిన ఆ సింహం దూకుడుగా ప్రవర్తిస్తూ.. ఆ తాళ్లను పళ్లతో కొరికేసింది. దాదాపు 30 నిమిషాల పాటు రక్షణ సిబ్బందికి, సింహానికి మధ్య ఉత్కంఠభరిత పోరాటం సాగింది.

చివరకు శ్రమ, సమన్వయంతో అధికారులు ఒక తాడు ఉచ్చును ఉపయోగించి సింహాన్ని బంధించగలిగారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి.. బావి అంచున ఒక బోనును సిద్ధంగా ఉంచారు. ఆపై సిబ్బంది మొత్తం కలిసి సింహాన్ని పైకి లాగడం ప్రారంభించారు. బావి నుంచి పైకి రాగానే.. సింహం సహజంగానే పక్కనే ఉన్న బోనులోకి వెళ్లింది. వెంటనే సిబ్బంది బోను తలుపులు వేశారు. సింహం సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ రెస్క్యూ వీడియోను గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ‘‘సమన్వయం, అసాధారణమైన ధైర్యంతో, అటవీ శాఖ బృందం గంటపాటు అవిశ్రాంతంగా శ్రమించింది. వారి ప్రయత్నాలు ఫలించాయి. సింహానికి ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా రక్షించారు’’ అంటూ ఆయన పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement