బంగారు లక్ష్మణ్ కన్నుమూత

బంగారు లక్ష్మణ్ కన్నుమూత - Sakshi


అనారోగ్యంతో నెలరోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స

 కార్మిక నాయకుడి నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎదుగుదల

 అవినీతి ఆరోపణలతో పతనమైన రాజకీయ జీవితం

 సంతాపం తెలిపిన రాజ్‌నాథ్, భగవత్

 నేడు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు


 

 సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ శనివారం కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5.15 నిమిషాల సమయంలో మృతి చెందారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు భార్య సుశీల, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. లక్ష్మణ్ భార్య సుశీల 2004లో రాజస్థాన్‌లోని ఝాలోర్ నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కుమార్తె శృతి ప్రస్తుతం బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. గతంలో బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మణ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూనే గత నెల మూడోతేదీన ఆసుపత్రిలో చేరారు.

 

  మూత్రపిండాలు, కాలేయం పూర్తి దెబ్బతినడంతో ఆయనను ఐసీయూలో ఉంచే చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 5.15 నిమిషాలకు ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలోని బెల్లా విస్తా అపార్ట్‌మెంట్‌కు తరలించారు. లక్ష్మణ్ మృతితో ఆయన స్వగ్రామం సిద్దంతి బస్తీలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.  అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ హైదరాబాద్ రానున్నారు.

 

 ప్రముఖుల సంతాపం

 బంగారు లక్ష్మణ్ మృతదేహాన్ని బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్, బద్దం బాల్‌రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ సందర్శించి నివాళులర్పించారు. లక్ష్మణ్ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు మోహన్‌భగవత్, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు లక్ష్మణ్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పీవీ చలపతిరావు, జాతీయ నాయకులు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్. రామచంద్రరావు, తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి ఎస్. కుమార్‌లు లక్ష్మణ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్‌లు కూడా సంతాపం తెలిపారు.

 

 ఎత్తు పల్లాల ‘బంగారు లక్ష్మణ’ం


 ఎతైన శిఖరం పక్కనే లోయ ఉంటుందన్నట్టుగా బంగారు లక్ష్మణ్ రాజకీయ జీవితం ముందుకు సాగింది. లక్ష్మణ్ 1939 మార్చి 17వ తేదీన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని సిద్దంతి బస్తీలోని అతి సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నాంపల్లి గవర్నమెంట్ హైస్కూలులో పదవ తరగతి వరకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. 12 ఏళ్ల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1958 -69 వరకు రాష్ట్ర విద్యుత్ శాఖలోనూ, కేంద్ర రైల్వే, ఏజీ శాఖలలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి ఆ తరువాత జనసంఘ్‌లో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా చేరిపోయారు.

 

  బీహెచ్‌ఈఎల్, మిథానీ, ఎఫ్‌ఐసీ కార్మిక నాయకుడి బాధ్యతలు నిర్వహించిన ఆయన ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్షను అనుభవించారు. 1978లో అప్పటి జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ, 1986లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేళ్ల పాటు పదవీ బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఏడేళ్లు పనిచేశారు. 1985- 86 మధ్య కాలంలో రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగానూ, 1996లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వాజ్‌పేయ్ మంత్రివర్గంలో రైల్వే, ప్లానింగ్ మరియు ప్రోగామింగ్ మంత్రిత్వ శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా, 2000 -2001 మధ్య కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. తెహల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకొని అవినీతి ఆరోపణలతో ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అవే ఆరోపణలతో రెండేళ్ల కిత్రం కోర్టు ఆయనకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఒక దళిత నేతగా అత్యున్నత శిఖిరాలకు ఎదిగిన తనను చూసి ఓర్వలేని వారు కక్ష కట్టి అక్రమ కేసులలో ఇరికించారంటూ ఆయన చివరివరకు తన సన్నిహితుల వద్ద చెబుతుండేవారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top