అరాచకాలకు, అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నయీమ్.. తన స్నేహితులు, పరిచయస్తులకు మాత్రం భారీగా మేలు చేకూర్చాడు.
సాక్షి, హైదరాబాద్: అరాచకాలకు, అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నయీమ్.. తన స్నేహితులు, పరిచయస్తులకు మాత్రం భారీగా మేలు చేకూర్చాడు. తనకున్న ప్రతీ పరిచయాన్ని నేర కార్యకలాపాల విస్తరణకు పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లు సిట్ విచారణలో వెలుగు చూస్తోంది. పాత పరిచయాలతోనే మహబూబ్‌నగర్ జిల్లాలో.. ముఖ్యంగా ఆమన్‌గల్, కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ లావాదేవీలు నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై 163 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో కూడా నయీమ్ ముఠా తలదూర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు కావడంతో సిట్ పోలీసులు దానిపై దృష్టిసారించారు.
మావోయిస్టు మాజీ కమాండర్ హత్య వెనుక
మహబూబ్‌నగర్ జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలను అణిచివేయడానికి పోలీసులకు నయీమ్ సహాయ సహకారాలు అందించినట్లు తెలుస్తోంది. 2014లో ఒక మాజీ మావోయిస్టు హత్య వెనుక నయీమ్ హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలోని వెల్దండ మండలం అజిలాపూర్‌కు చెందిన మావోయిస్టు మాజీ కమాండర్ శ్యాం అలియాస్ యాదయ్య 2014లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన వెంటనే రమాకాంత్ అనే మాజీ మావోయిస్టు మరికొంత మంది లొంగిపోయారు.
వీరందరూ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత.. మాజీ మావోయిస్టులు ఈశ్వరయ్య, రమాకాంత్ కనిపించకుండా వెళ్లిపోయారని, వారి ఫోన్లు కూడా స్విచ్ఛాప్ చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరి ద్వారా నయీమ్ కుడిభుజం శేషన్న ఆచూకీ కనిపెట్టాలని భావిస్తున్నారు.
ముంబై నుంచి బెదిరింపు కాల్స్: గోళి సుధాకర్‌రెడ్డి
హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై తనతో పాటు మరో 20 మంది రైతులకు సంబంధించిన 163 ఎకరాల వ్యవసాయ భూమిపై నయీమ్ ముఠా కన్నేసి వేధింపులకు గురిచేసిందని గోళి సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి పేర్కొన్నారు. వెల్దండ మండలంలోని సర్వే నంబర్లు 27, 44, 46, 49, 50, 97, 98, 122, 303/2, 55/1, 55/2 లలో 163 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, దీనిపై కన్నేసిన నయీమ్ ముఠా ఏడాదిన్నరగా తనను వేధించిందన్నారు. చంపేస్తామనడంతో ఏడాదికి పైగా అజ్ఞాతంలో ఉంటున్నట్లు చెప్పారు. తన భార్యకు నయీమ్ అనుచరులు 8767913712 నంబర్ నుంచి ఫోన్ చేశారని, దీనిపై మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బెదిరింపు కాల్‌ను పోలీసులు ట్రేస్ చేయగా ముంబై అడ్రస్‌తో నంబర్ ఉన్నట్లు తేలిందన్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత ప్రస్తుతం ఆ భూమి వద్దకు అతడి అనుచరులెవరూ రావడం లేదన్నారు.