‘బంగారు తల్లి’కి నిధులేవి? | Bangaru Talli Scheme no Funds | Sakshi
Sakshi News home page

‘బంగారు తల్లి’కి నిధులేవి?

Dec 24 2014 3:16 AM | Updated on Sep 4 2018 5:07 PM

‘బంగారు తల్లి’కి నిధులేవి? - Sakshi

‘బంగారు తల్లి’కి నిధులేవి?

ఆడపిల్లల జీవితాలకు భద్రత కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘బంగారు తల్లి’ పథకానికి బడ్జెట్ కరువైంది.

సాక్షి, హైదరాబాద్: ఆడపిల్లల జీవితాలకు భద్రత కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘బంగారు తల్లి’ పథకానికి బడ్జెట్ కరువైంది. తెలంగాణలో భ్రూణ హత్యలను నివారించడంతోపాటు ఆడపిల్లలను ప్రోత్సహించే నిమిత్తం గత ఏడాది మేలో అప్పటి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అంతటితో ఊరుకోకుండా గత ఏడాది జూన్ 19న బంగారు తల్లి పథకానికి ప్రత్యేకంగా సాధికారత చట్టాన్ని తీసుకొచ్చింది. పుట్టినప్పటి నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకునే వరకు వివిధ దశల్లో ఆడపిల్లలకు ఆర్థికంగా సాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. అయితే రాష్ట్ర విభజన అనంతరం వచ్చి న కొత్త ప్రభుత్వం ఈ పథకానికి తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. దీంతో ఈ పథకం కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పడం లేదు. చట్టంగా రూపుదిద్దుకున్న బంగారు తల్లి పథకం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
 దీనిపై సంబంధిత అధికారుల్లోనూ స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు. బంగారు తల్లి పథకం కింద పేద కుటుంబంలో గర్భవతులకు కాన్పు అయ్యే వరకు నెలకు రూ. వెయ్యి చొప్పున, ఆడపిల్ల జన్మిస్తే వెంటనే 2500 రూపాయలను ప్రభుత్వం చె ల్లిస్తుంది. ఐదేళ్లు వచ్చేవరకు అంగన్‌వాడీ ద్వారా రూ. 1500 చొప్పున చెల్లిస్తారు. పాఠశాల్లో చేరిన రోజున రూ. వెయ్యి, ఐదో తరగతి వరకు ప్రతి సంవత్సరం రూ. 2 వేల చొప్పున, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఏటా రూ. 2500, తర్వాత పది వరకు రూ. 3000, ఇంటర్మీడియట్ సమయంలో ఏటా రూ. 3500, డిగ్రీ చదువుకునేపుడు ప్రతి ఏటా రూ. 3000 అంది స్తుంది. 21 ఏళ్ల తర్వాత ఇంటర్‌తో చదువు ఆపిన బాలిక లకైతే రూ. 50 వేలు, డిగ్రీ పూర్తి చేసిన వారికి రూ. లక్ష రూపాయలను ప్రభుత్వం ఆర్థికసాయంగా అందజేస్తుంది.
 
 2020 నాటికి 80 లక్షల మంది బాలికలకు, 18 లక్షల మంది కొత్తగా జన్మించిన పిల్లలకు సాయం అందించాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కే టాయించకపోవడంతో సుమారు లక్ష మంది బంగారు తల్లులకు ఆర్థికసాయం అందడం లేదు. ఇప్పటివరకు మొత్తం 1,68,055 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 72,869 మందికి మొదటి విడత సొమ్ము మాత్రమే అందింది. మిగతా చెల్లింపులన్నీ ఆగిపోయాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 70,021 దరఖాస్తులు రాగా, వీరికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. మరోవైపు పాతవారికే ఇంకా సాయం అందనందున, కొత్తగా దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధిత ప్రభుత్వ విభాగాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా ‘బంగారు తల్లి’ పథకంపై ఆడపిల్లల తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యే పరిస్థితి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement