నడుము నొప్పి- ఆయుర్వేద చికిత్స | Ayurvedic treatment waist pain | Sakshi
Sakshi News home page

నడుము నొప్పి- ఆయుర్వేద చికిత్స

Dec 8 2014 12:29 AM | Updated on Sep 2 2017 5:47 PM

ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పని ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహారలోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, రాత్రివేళ నిద్రలేకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి. ఆందోళన, మానసిక ఒత్తిడి వంటివీ  అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతి ముఖ్యమైనది నడుమునొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రంలో నడుము నొప్పిని గుధ్రసీవాతంగా పేర్కొన్నారు. నూటికి 20 శాతం మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒక్కసారి నడుము నొప్పిబారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది.

 కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, ఎక్కువ గంటలు, విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు నడుము నొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాతప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్తబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుము భాగం, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాల్లోకి నొప్పి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్4, ఎల్5,  వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరంపై ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది.

 డిస్క్‌లో వచ్చే మార్పులు: వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్‌లపై ఒత్తిడి పెరుగుతుంది. వాపు రావటం, డిస్క్‌కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్క్ అరిగి పోవటం వంటి సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటకి వచ్చి వెన్నెముక నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల వెన్ను నొప్పి వస్తుంది.
 లక్షణాలు: నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కొల్పోతారు. సమస్య తీవ్రమైన కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్‌‌స వాడటం మంచిదికాదు. పెయిన్ కిల్లర్‌‌సతో మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది.

 నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స: నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్స పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనము, శమన చికిత్స, శోధన చికిత్స అనేవి ప్రధానమైనవి. ఇంకా కటివస్తి (ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ) చికిత్స ద్వారా అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించవచ్చు. ఇదే క్రమంలో సర్వాంగధార  చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ చికిత్స ద్వారా నాడీ కణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే పక్వాశవలో వాత స్థానం బట్టి ప్రకోపించిన వాతాన్ని కూడా సహజ స్థితికి తీసుకురావచ్చు.
 జాగ్రత్తలు: పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించాలి. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వత విముక్తి
 కలుగుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement